Friday 30 May 2014

మీరాబాయి


మీరాబాయి 1498 లో రాజస్థాన్‌లో మెర్బా పట్టణంలో రాధోర్స్ రాజవంశంలో జన్మించింది. ఈమె తండ్రి రావు రతన్‌సింగ్ గొప్ప వైష్ణవ భక్తుడు. వీరు నివసించే ఇంటికి సమీపంలో ఒక విష్ణు దేవాలయం ఉండేది. మీరాబాయి తన తల్లిదండ్రులతో తరచు ఈ విష్ణుదేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తూండేది. అక్కడ విష్ణువుని స్తుతించే స్తోత్రాలు, కీర్తనలు మిరాబాయి మనస్సులో పూర్తిగా నాటుకున్నాయి. 

నాలుగైదు సంవత్సరాల బాలికగా ఉన్న మీరాబాయి ఒకనాడు ఒక పెళ్ళి ఊరేగింపులో గుర్రం మీద పెళ్ళికొడుకుని, పల్లకిలో పెళ్ళికూతురుని చూచింది. వెంటనే తనుకూడా పెళ్ళి చేసుకోవాలని పట్టుపట్టింది. మీరాకి ఇంకా పెండ్లి ఈడు రాలేదని, కొంచెం పెద్దదైన తరువాత పెళ్ళి చేసుకోవాలని తల్లి చెప్పింది. కానీ మీరా పట్టినపట్టు వీడలేదు. అప్పుడు తల్లి పరిహాసంగా " అయితే చేసుకో, పూజామందిరంలో కృష్ణుని పెళ్ళి చేసుకో అంది. మీరాకి పట్టరాని సంతోషం కలిగింది. ఆనందంతో పూజామందిరంలో కృష్ణుని విగ్రహం దగ్గరకు చెంగు చెంగున పరుగెత్తి వెళ్ళింది. విగ్రహాన్ని రెండు చేతులతో ఎత్తి ముఖానికి అద్దుకుంది. 

ఆనాటినుంచి శ్రీకృష్ణ విగ్రహం మీద మీరాకి భక్తి పెరిగింది. రాను రాను ఈ భక్తి దివ్య ప్రేమగా మారిపోయింది. ఇంతలో మిరాబాయి యుక్తవయస్సులో తల్లి మరణించింది. మీరాకి 18 సంవత్సరాలు వయస్సు వచ్చింది. మీరాకి వివాహం ఎంతమాత్రం ఇష్టం లేదు. శ్రీకృషునికి తన హృదయాన్ని ఏనాడో అర్పించుకున్నానని చెప్పింది. కానీ ఈమె మాటను ఎవరూ వినలేదు. 

వివాహం అయిన తరువాత మీరాబాయి ప్రతీదినం గంటల తరబడి తన శ్రీకృష్ణ విగ్రహాన్ని తన్మయత్వంతో పూజిస్తూ ఉండేది. దీనివల్ల నిత్య గృహకృత్తాలకు ఆటంకం కలుగుతూండేది. అత్తవారింట్లో ఆమెను తరచు దూషిస్తూండేవారు. ఆమెకు వివాహ జీవితం సుఖం అనిపించలేదు. 1523 లో భోజ్‌రాజ్ విస్పంతుగా మరణించాడు. ఒకదానిపై ఒకటి అనేక కష్టాలు ఏర్పడ్డాయి. రాజపుత్రులకు మంచి రోజులు మారిపోయాయి. 

మిరాబాయికి ప్రాపంచిక సుఖాలమీద విరక్తి కలిగింది. శ్రీకృష్ణునిపై విశ్వాసం, భక్తి స్థిరపడిపోయింది. తరచు దివ్యోన్మాదంతో తన్మయం పొందుతూండేది. దేవాలయంలో శ్రీకృష్ణుని దివ్య విగ్రహహం ముందు కూర్చుని కూర్చి పాడుతూండేది. ఈమెపాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు చేరేవారు. ఏమే పారమార్థిక జీవితం ఉపద్రవకరంగా ఉందని రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోడానికి ఈమెను హత్యచేయడానికి ప్రయత్నించారు. 

ఒక బుట్టలో పామును పెట్టి పూవులదండ అని చెప్పి ఆమె ఆ పామును పూలమాలగా కంఠంలో ధరించింది.మరొకసారి ఒక చిన్న బంగారుగిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు. నిర్భయంగా ఆ పాలను త్రాగింది. 

మీరా చిత్తూరులో నివసించడానికి ఇష్టపడ లేదు. శ్రీకృష్ణుని వివాహం చేసుకున్నాననే విశ్వాసం ఆమెలో
జనించింది. భక్తితో సేవలు, పూజలుచేస్తూ పాటలు పాడుకుంటూ దివ్యనామ సంకీర్తనంతో రాజస్థాన్‌కు ప్రయాణం ప్రారంభించింది. భక్తురాలైన మీరాని దర్శించడానికి వివిధ మూలల నుంచి అనేక మంది భక్తులు వచ్చేవారు. జనం మూగి తన భక్తికి అంతరాయం కలిగిస్తున్నారని తలచి ఆమె దూరంగా గుజరాత్ లో ద్వారక చేరుకుంది. ఊరువిడిచి వెళ్ళిపోయినందుకు అనేకమంది విచారించారు. కొంత మంది ఆమెను తిరిగి స్వగ్రామానికి తీసుకురావడానికి ద్వారకకు వెళ్ళారు. 

మీరా శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని వేడుకుంది. నాట్యంచేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడింది. శ్రీకృష్ణ విగ్రహం పాదాలపై బడి పాదాలను కళ్ళకు అద్దుకుంది. చూస్తూండగానే శ్రీ కృష్ణ విగ్రహంతో ఐక్యమైపోయింది. రాజస్థాన్‌కి తిరిగి వెళ్ళలేదు.

No comments:

Post a Comment