Monday 26 May 2014

అనుష్ఠాన వేదాంతం

భారతీయ సంస్కృతికి మూలపురుషుడు శ్రీకృష్ణద్వైపాయనుడు. భారతీయ సంస్కృతి వేదాలమీద ఆధారపడి ఉంది. సమస్త ప్రకృతి నియమాలకు అధీనుడై, ప్రత్యణువులోనూ పరమాత్మను దర్శించమని వేదాంతం చెపుతోంది. కాల ప్రభావంలో పతనావస్థకు చేరువైనా, భారతీయతత్వం వేగంగా పునరుజ్జీవం పొందింది. కారణం భారతీయ తత్వానికి పునాదిగా నిలిచిన ఆత్మతత్వం. అందువల్లనే భారతీయ ఆధ్యాత్మికతత్వం, సనాతనమై చిరంజీవిగా నిలచి ఉంది.
పతనావస్థలోనున్న జాతిని పునరుజ్జీవింపజేయడానికి మహాపురుషులు అవతరిస్తుంటారు. ఆ కోవలోని బుద్ధ్భగవానుడు స్వార్థరహిత కర్మాచరణకే ప్రథమ స్థానం ఇచ్చాడు. నిష్కామకర్మ యోగాన్ననుష్టించాడు. త్యాగం, కరుణ, ప్రాణి కోటియెడల ప్రేమ ఆయన మూల సూత్రాలు. ఇవి మానవ సంక్షేమంపై కేంద్రీకరించబడిన ఆశయాలు. ‘‘సిద్ధాంతాల రాద్ధాంతాలవల్ల ఏం ప్రయోజనం? సత్కర్మలుచేస్తూ సజ్జనులై వుండండి’’ అని ప్రబోధించాడు. నేడు సమాజ సత్వరాభివృద్ధికి, స్వార్థరహిత కర్మాచరణం తప్ప వేరే మార్గం లేదు.
19వ శతాబ్దిలో అవతరించిన మహాపురుషులు భగవాన్ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందులు. శ్రీ వివేకానందుడు శ్రీరామకృష్ణ అంతే వాసులుగా విశ్వవిఖ్యాతిగాంచారు. వేదాంతులకు వేదాంతిగా, జ్ఞానులకు తత్తవేత్తగా భాసిల్లాడు. ప్రతి జీవికి ఆత్మీయుడుగా, ఆత్మానుభవంతో వారికి ప్రాణసఖుడిగా నిలిచాడు. భారతీయులు దీన స్థితినిగాంచి దుఃఖించాడు. విశిష్ట అద్వైవాదిగా పేరుమోసినా, లోక కల్యాణానికి దిశా నిర్దేశం చేసిన అగ్రశ్రేణి దేశభక్తుడు, ఆధ్యాత్మికత లక్ష్యం కేవలం స్వీయ విముక్తికే కాకుండా, దీన జననోర్థరణకే అని నమ్మి, ఆ ఆదర్శ సాధనకై తన జీవితాన్ని త్యజించిన మహా అనుష్టాన వేదాంతి శ్రీ వివేకానందుడు, పరమ పావన యతివర్యుడు.
భారతదేశ సముద్ధరణకు, భారతీయ సనాతన ధర్మపునరుజ్జీవనానికి అమెరికా, ఐరోపా దేశాల్ని విరివిగా పర్యటించి, ధార్మికోపన్యాసాలనిచ్చారు. దేశంలోని ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచ్చడానికై ధన సమీకరణ కూడ ఆయన పర్యటనల్లోని మరో ముఖ్యోద్దేశం. విదేశాల్లో ఆర్థిక సహాయం పొందటం ఎంత కష్టమో కూడా ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ చెప్పారు. సమాజోద్ధరణకై అద్వైతిగా కర్మయోగ అనుష్టానానికి, ఉత్కృష్ట పార్వ్శాన్ని ఆవిష్కరించిన మహాపురుషుడు.
దీనుల గురించి ఆయన ఆత్మఘోష ఆయన మాటల్లోనే విందాం.
‘‘ఇప్పుడు కావాల్సింది అనుష్టాన వేదాంతం. అధోగతిపాలైపోతున్న కోట్లకొలది దీనుల వద్దకు పోవాలి. మనకీనాడు కావాల్సింది ఆధ్యాత్మికత కాదు. ప్రపంచంలోకి కొంచెం అద్వైతం ప్రవేశపెట్టాలి. ఇది ముఖ్యం. మొట్టమొదట భుక్తి. ఆ తరువాతది ముక్తి. దరిద్రులు తిండిలేక మాడుతుంటే, మితిమీరిన మతబోధ ఎందుకు? సిద్ధాంతాలు ఆకలి మంటల్ని నివారించగలవా? ముందు దీనుని ఆకలి చంపి, ఉద్ధరించాలి. మీరు అన్నింటిని, తుదకు ముక్తిని సైతం త్యాగం చేయండి. దీనునిలోనే బ్రహ్మాన్ని దర్శిస్తూ స్మరిస్తూ, వారిని చేయిపట్టుకొని నడిపించండి. గీతాచార్యుని ఉపదేశానుసారం సమన్వతభావాన్ని మనసున సుస్థిరం చేసుకొని, జీవితం సార్థకం చేసుకోవాలి’’- ఇదీ వేదాంతాచరణలోని సామాజిక కోణం. దీనులనుద్ధరింప అవశ్య ఆచరణీయం. స్వామి ప్రస్తావించి 104 సంవత్సరాలు అయింది. ఆయన ఆశయ సాధనకు రామకృష్ణమిన్ అహరహరం కృషి చేస్తోంది. మానవసేవే భగవత్‌సేవగా చిత్తశుద్ధి కలిగిన అగ్రగామి సంస్థగా పేరుగాంచింది. ధీరులైన, బలసంన్నులైన, నిర్మల హృదయులైన, స్వార్థత్యాగులైన, ఆరోగ్యవంతులైన యువకులపైనే స్వామివారి చూపు. అలాంటివారు మాత్రమే వేగంగా దేశాభివృద్ధిని సాధించగలరని ఆయన దృఢవిశ్వాసం. ఆనాటి సామాజిక పరిస్థితి నేటికీ ఉంది. అంచేత భారతీయ యువకులు స్వామి జీవితానుభవాల నుంచి స్ఫూర్తిని పొంది, కార్యాచరణకు సంసిద్ధులై, భరతమాత దురవస్థను దూరం చేసి ఋణం తీర్చుకోవాలి.

No comments:

Post a Comment