Monday 19 May 2014

హిందూ ధర్మాన్ని గురించి నాలుగు ముక్కల్లో....

హిందూ ధర్మాన్ని గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే ఇట్లా చెప్పవచ్చు:-
* ఓం మాతృదేవో భవః
* ఓం పితృదేవో భవః
* ఓం ఆచార్యదేవో భవః
* ఓం అతిధిదేవో భవః
పై నాలుగు ధర్మాలు హిందూ ధర్మానికి మూల స్థంభాలు. ఈ నాలుగు ధర్మాలపైనే హిందూ జాతియొక్క నిర్మాణం జరిగిందని చెప్పటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అమ్మా,నాన్నలను; గురువులను, అతిథిలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో మన హిందూ శాస్త్రాలెన్నో కథల రూపంలో సవివరంగా చెప్పాయి.
శంఖంలో పోస్తేకానీ తీర్ధం కాదని నానుడి. అలాగే మొక్కై వంగనది మ్రానైవంగునా అనేదికూడా మరొక నానుడి. ఊహ తెలుస్తున్న వయసులో పిల్లల్లో శబ్దగ్రహణ శక్తి; విషయ గ్రహణ శక్తి; జ్ఞాపకశక్తి ఎక్కువగా వుంటుందని నాటి, నేటి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇదే విషయం ఆధారంగా, మంచి విషయాలను పిల్లలకు ఊహ తెలుస్తున్న వయస్సుల్లోనే ఉగ్గుపాలు పోసినట్ట్లుగా తెలియచేయాలని మన పూర్వీకులు నిర్ణయించారు.
మరి మన పూర్వీకులు పై విషయంలో ఏం చేసారు? సాధారణంగా మన ప్రపంచం పురుషాధిక్యత ప్రపంచం. స్త్రీకి రెండవ స్థానం ఇవ్వబడింది. ఇది సమసమాజానికి చేటు చేస్తుందని తెలిసే, మన పూర్వీకులు ప్రతి చోటా స్త్రీని మెదట స్థానంలో వుంచటానికి ప్రయత్నించారు. అందుకు మొదట ఉదాహరణే ‘ మాతృదేవో భవః ’ అని చెప్పటం. సీతారాములు; లక్ష్మీనారాయణులు; ప్రకృతి,పురుషుడు మరికొన్ని ఉదాహరణలు.
భూమి తనయొక్క ఆకర్షణచే ప్రతి జీవరాశిని తన అధీనంలో ఉంచుకుంటుంది ( దీనివల్ల ఎన్నో సృష్టి లాభాలున్నాయి ). భూమ్యాకర్షణలాగే, భౌతికమైన ఈ జగత్తులో, పుట్టుకతోనే ప్రతి జీవి, ముఖ్యంగా “ మనిషి ” తన జీవన మనుగడకోసం భౌతిక విషయాలపట్ల ఎక్కువగా ఆకర్షింపబడివుంటాడు. వాటి ఆకర్షణ వలలో పడిపోయి, తనయొక్క మూలాల్ని మరిచిపోతుంటాడు. ఒకానొక దశలో కేవలం ఒక మర మనిషిగా; సుఖాలకోసమే బ్రతకాలి అన్న ఒక్క మిషలో పడిపోతాడు. అప్పుడు సమాజం మిధ్యాలోకంలోనే కొట్టుమిట్టులాడుతూ వుంటుంది.
ఉగ్గుపాలు పోసినట్లుగా, మంచి విషయాలను పిల్లలకు చిన్నప్పుడే బోధించాలి అని పైన చెప్పుకున్నాంగదా. అందులోని భాగంగా, పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక ‘మంత్రాన్ని’ మన పూర్వీకులు ఉపదేశించారు. అదే, “ ఓం నమఃశివాయః సిద్ధం నమః ” (అక్షరాభ్యాసం -అనే శీర్షికతో నాచే వ్రాయబడిన వ్యాసాన్నికూడా చదవగలరు ). ఇంతకీ ఈ మంత్రానికీ, స్త్రీకి, పురుషునితో సమాన హోదా ఇవ్వటానికీ; మన హిందూ ధర్మానికీ ఏమిటి సంబంధం? అని సందేహం ఎవరికైనా రావచ్చు. మరి, మరికొంత ముందుకు చదవండి:
ఓం నమః = ఓం అంటే ప్రణవ నాదం; ఈ చైతన్య జగత్తుకు మూల నాదం; అటువంటి ప్రణవ నాదానికి నా నమస్కారములు అని మొదటగా ఆ చిన్న విద్యార్ధి చిలుక పలుకులు పలుకుతూ, మంత్రాన్ని వల్లె వేయటం మొదలుపెడతాడు.
శివాయః = ఈ పదం, ‘ శ్ + ఇ + వ్ + అ ’ అనే అక్షరాల కూర్పు. ‘ఇ’ = ఈ అక్షరం అమ్మ లేదా అమ్మవారిని సూచిస్తుంది; ‘అ’ = ఈ అక్షరం అయ్య లేదా అయ్యవారిని సూచిస్తుంది; భౌతికమైన ఈ జగత్తు నిర్మాణానికి ‘తల్లి, తండ్రు’లు మూలాలు. ఈ ఇద్దరి కలయికవలనే జగత్తు నిర్మాణం సాకారమవుతుంది. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జగత్తు నిర్మాణం జరగదు. ‘శివ’ అనే పదం ‘శక్తి’ని సూచిస్తుంది. ఈ శక్తి అమ్మ, అయ్యవార్ల కలయిక వలననే జరుగుతుంది; ‘శ్+ఇ+వ్+అ’ ల అక్షరమాలలో ‘ఇ’ అక్షరం వున్నప్పుడే, ఆ పదం ‘శివ’ గా వుంటుంది; అందులోని ‘ఇ’ ని తీసివేస్తే, అది ‘శ్+వ్+అ’ = శవ అనే పదంగా మారుతుంది. అంటే, శివం, శవంగా మారిపోతుంది. శివం శక్తిమయం; శవం శక్తి హీనం. – కాబట్టి, అట్టి శక్తిమయమైన జగత్తుకు కారణభూతులైన అమ్మ, అయ్యవార్లకు, ఓం నమః = నమస్కరిస్తూ …
సిద్ధం నమః = అటువంటి జగత్ సృష్టికి మాతాపితలైన (లేదా నా పుట్టుకకు మూలకారణమైన నా తల్లి,తండ్రులకు ) వారియొక్క ఆశీస్సులు సదా నాకు ‘సిద్ధించాలి కోరుకుంటూ, నమస్కరిస్తున్నాను’….
అనే అర్ధంతో ఆ మంత్రాన్ని మన పెద్దలు మనకు ఊహ తెలియటం మొదలవుతుండగానే మననం చేయించారు. మొక్కగా వున్నప్పుడే మనసులో పడిన ఆ భావంయొక్క అర్ధం పెద్దయిన తరువాత మానుగా మనస్సులో నిలబడిపోయి, మన తల్లి,తండ్రులను గౌరవించటం, ప్రేమించటం, అలవాటు అవుతుందని చెప్పటంలో ఎటువంటి అనుమానం వుండనక్కరలేదు.
పై విషయాల్ని, ఆదిశంకరులు తమ ‘సౌందర్యలహరి’ లో మొట్టమొదటి శ్లోకం, “శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః” లో మనందరికీ తెలియచేసారని పండితులు తమతమ భాష్యాలలో మనకు చెప్పటం జరిగింది. మరి మన కర్తవ్యం ఆ మంత్రాన్ని మనం చేసి, చేస్తూ, చేయిస్తూ వుండటమే!! స్వస్తి.

No comments:

Post a Comment