Monday 19 May 2014

సౌమ్యభాషణాన్నీ సమాశ్రయిద్దాం.

మన అనుదిన వ్యవహారాల్లో మన మాటలే మన జీవితాలను అత్యద్భుతంగానో, లేదా అధమాధమం గానో మార్చగల శక్తివంతమైనవి. ఎదుటి వారిని చూసి స్నేహ పూర్వకంగా ఒక చిరునవ్వు నవ్వటం, మృదువుగా మాట్లాడటం అనే రెండు గొప్ప లక్షణాలు ప్రపంచాన్ని శాంతిమయం చేస్తాయనటంలో సందేహం లేదు. సాంఘిక సహజీవనం ప్రశాంతంగా సాగాలంటే ఈ రెండిటినీ సాధన చేయాలి. ప్రతి మనిషీ ప్రక్కవాణ్ణి చూసి అనుమానపడటం, భయపడటం కంటే విషాదం మానవజాతికి మరొకటుండదు.
అవాంఛనీయ ధోరణులు ప్రబలి, అశాంతి నెలకొంటున్న సందర్భాల్లో స్నేహపూర్వక దరహాసం, ప్రేమపూరిత సౌమ్య భాషణం మానవులు కోరుకునే శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించ గలుగుతాయి. క్రొత్త ప్రాంతాలకు వెళ్ళినపుడు మానవులకు భాషాసమస్య ఎదురుకావచ్చు. ఎవరి భాష ఏదైనా మానవులందరూ శబ్దమే అవసరం లేని మౌన దరహాసంతో పలుకరించుకోగలరు. అది అన్నిటికీ అతీతమైన “దరహాస భాష".
అధునాతనమైన వస్త్రధారణం చేయవచ్చుగాక, ఎంతో ఖరీదైన ఆభరణాలతో, సుగంధ లేపనాలతో శరీరాన్ని అలంకరించుకోవచ్చుగాక – పెదవుల మీద ఒక్క సజీవమైన చిరునవ్వు తళుక్కుమనకపోతే ఆ అలంకరణ అసంపూర్ణమే అనక తప్పదు. ఒక్క చిరునవ్వు నవ్వు. అది నీ ముఖవిలును పెంచుతుంది అంటాడొక ఆంగ్ల రచయిత.
 రామాయణం – బాలకాండలో అయోధ్యా పౌరులను, మంత్రి, పురోహిత బృందాన్ని వర్ణిస్తూ వాల్మీకి –“ తేజ క్షమా యశః ప్రాప్తాః స్మిత పూర్వాభిభాషిణః" అంటాడు. అయోధ్యాపుర ప్రజలందరూ రాముని గుణగణాలను దశరథునకు వివరించి చెప్పే సందర్భంలో కూడ ఆయనను “స్మిత పూర్వాభిభాషీ చ" అంటారు. ఇందులో “స్మితపూర్వాభిభాషి" అనే విశేషణం గమనించదగినది. 
అక్కడి పౌరులు, రాముడు కూడా చిరునవ్వుతో “ముందుగా" మాట్లాడే లక్షణం కలవారని దీని అర్థం. చిరునవ్వు నవ్వటం ఒక సద్గుణమైతే , “ముందుగా మాట్లాడటం" మరింత విశిష్ట సద్గుణం.

సాధారణంగా లోకంలో చాలామందికి అనిమిత్తమైన ఒక అహమిక ఉంటుంది. తమకు తెలిసిన వ్యక్తి కొంతదూరంలో కనిపిస్తూ ఉంటే, ఆయనను గమనించి కూడా గమనించనట్లే ఉంటారు. ఆయనే తమతో ముందుగా మాట్లాడాలనుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తే వచ్చి మాట్లాడాడనుకుందాం, అంతవరకూ అసలు తాను ఆ వ్యక్తిని చూడననట్లే నటించి “అరే.. నేను మిమ్మల్ని గమనించనే లేదూ!" అనే అసత్యంతో సంభాషణ మొదలు పెడతాడు. అలాంటి అహమిక లేకుండా, చిరునవ్వుతో మనమే ముందుగా మాట్లాడటం మన ఉత్తమ సంస్కారానికి నిదర్శనం.
“ప్రపంచం ఒక నిలుటద్దం లాంటిది. దాన్ని మనం చిరునవ్వుతో చూస్తే అదీ మనకొక చిరునవ్వును ఇస్తుంది" అంటారు విజ్ఞులు. ఇక భాషణం దగ్గరకు వస్తే - “ప్రియ వాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః  తస్మాత్తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా?" ఒక్క ప్రియమైన వాక్యం మాట్లాడితే సమస్త జీవులూ సంతోషిస్తాయి. అందువల్ల అలాగే మాట్లాడాలి. మాటలకు ఏం దారిద్ర్యం? అని ఈ శ్లోక భావం. భగవదనుగ్రహంతో – “మాట్లాడగల్గటం" అనే సంపద సమృద్ధిగా ఉన్నవాళ్ళమే కదా! 

అర్థం లేని అహంకారంతో మన చుట్టూ మనమే గిరులు గీసుకొని కూర్చోవటం కంటే అందరితోనూ మైత్రీ పూర్వకంగా మాట్లాడితే ఉద్రేకాలూ, ఉత్కంఠలూ తగ్గుతాయి. శారీరక, మానసిక ఆరోగ్యాలు మెరుగు పడతాయి.

మృదు భాషణంలో ఉండే శక్తి పరుషభాషణానికి ఉండదు. మొదటి దాని పట్ల గౌరవం, భక్తి ఉంటాయి. రెండవదాని పట్ల కేవలం భయమూ, ఏవగింపూ ఉంటాయి. వాటిని పైకి వ్యక్తీకరించక పోయినా ఆ మాటలకు బాధపడినవారు అలా మాట్లాడిన వారిని లోలోపల తిట్టుకుంటూ ఉంటారు.

ఎవరైనా ఒక మంచిపని చేస్తే బిగ్గరగా మెచ్చుకోవాలి, తప్పు పని చేస్తే మృదువుగా మందలించాలి. మెచ్చుకోలు మంచిని ప్రోత్సహిస్తుంది, మందలింపులోని మృదుత్వం – మరోసారి ఆ తప్పు చేయకుండా నిరోధిస్తుంది.
ఇదీ- మాటతీరుకు ఉండే శక్తి. మాట ఎంతో విలువైనది. అందుకే మాటలో పొదుపునూ పాటించాలి. కోపం వచ్చినపుడు సంయమనంతో మాటను మరింత అదుపులో ఉంచుకోవాలి.అందుకే స్నేహ హాసాన్నీ, సౌమ్యభాషణాన్నీ సమాశ్రయిద్దాం.

No comments:

Post a Comment