Monday 19 May 2014

భాగవతం వింటే బాగవుతాం//

శ్రీ కృష్ణపరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు. కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్ఙ్మయమూర్తియనీ, బ్రహ్మ సూత్రాలకు భాష్య రూపమనీ, సకల వేదసారమనీ, కామక్రోధాలను జయించడానికి, ధు:ఖ దారిద్ర్య, పాపములను ప్రక్షాళన కావించుటకు, భాగవతానికి మించిన ఔషదము వేరొకటిలేదనీ, కాశి, గంగ, ప్రయాగ, గయ, తీర్ధ సేవనము, భాగవత కధా శ్రవణానికి సాటిరావనీ, ఎక్కడభాగవత కధా శ్రవణ జరుగుతుదో అదే పుణ్య తీర్ధమని, వెయ్యి అశ్వమేధయాగాలు, వంద వాజపేయ యాగముల ఫలితం భాగవత కధా శ్రవణములో 16 వ వంతు సరితూగనిదనీ, ఈ ఒక్క భాగవత కధా శ్రవణ మాత్రముననే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్ష్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది.

ఆర్తితో ఆపదలో మొరపెట్టుకొన్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు?

బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడనికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని?

శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది దుష్టరాజులతో స్వయంగా యుధ్ధం చేసి అవలీలగా సమ్హరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముధ్రవేయించుకొన్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుధ్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడ చేపట్టుకోనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడనికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిఙ్ఞులచే ఏవిధంగా ఆమోదింపబడ్డాడు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు. గోవులను కాచాడు. ఆటలాడాడు, పాటలూ పాడాడు. చిలిపి చేష్టలు చేసి కొంటెవాడనీ అనిపించుకొన్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు. పెద్దవాడై దొరగా రాజ్యపాలనా చేశాడు. రాజనీతిని పాటించాడు. రాజకీయ వ్యవహారాలనూ నడిపించాడు. రాయబారం చేశాడు. రధాన్ని నడిపాడు రాసక్రీడలు సలిపాడు. గురుసేవలు చేశాడు. ఎంగిళ్ళు తిన్నాడు. విషాన్ని హరించాడు. బ్రాహ్మణుల పాదాలు కడిగాడు. మహారాజులచే పాదపూజలందుకున్నాడు. శత్రువులను సం హరించాడు. చివరకు క్షవర కర్మ కూడ (రుక్మికి గడ్డాలు, మీసాలు జుట్టు గొరిగాడు) చేశాడు. ఆర్తులను ఆదరించి సేదతీర్చాడు ఆపదలోఉన్నవారిని బంధువుగా ఆదుకొన్నాడు. సంసారిగా జీవించాడు. భోగిగా కనిపించాడు. మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు. నిందలను మోసాడు. దూషింపబడ్డాడు. అయినా చిరునవ్వుతో వాటినన్నిటినీ ఎదుర్కొన్నాడు. సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వినుతికెక్కాడు. ఆనందరూపుడై ఆబాలగోపాలాన్నీ అలరించాడు. మధుర మూర్తియై ప్రేమా- మృతాన్ని వెదజల్లాడు. ఙ్ఞాన స్వరూపుడై ఙ్ఞానకాంతులను విరజిమ్మాడు. శాంతికాముడై ధర్మ స్థాపనకు ఉద్యమించాడు.

ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీ కృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను మహాత్మ్యాన్ని స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు.

శ్రీ కృష్ణాష్టకం
1.వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్ధనం

దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుం.

2.అతసీపుష్పసంకాశ - హారనూ పురశోభితం

రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుం.

No comments:

Post a Comment