Monday 19 May 2014

ప్రశాంత గంగ ... అనురాగ తరంగ

అయోధ్యను  సగరుడు అనే రాజు పరిపాలించేవాడు.అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకి అసమంజసుడు, రెండవ భార్యకి అరవై వేల మంది కొడుకులు పుట్టారు వారినే సగరులు అందురు.  అసమంజసుడు కుమారుడు అంశుమంతుడు.  సగర చక్రవర్తి కి అశ్వమేధ యాగం ప్రారంభించాడు.  ఆ అశ్వానికి కాపలాగా ఈ అరవై వేలమంది సగరులను నియమించాడు.
ఆ అశ్వాన్ని ఇంద్రుడు దాచి ఉంచడంతో ఆ సగరులు భూమిని చీల్చి, తవ్వి, విరిచేసి పాతాళమునకు చేరుకున్నారు.  ఆ పాతాళములో శ్రీమహావిష్ణువు కపిల మహర్షి రూపంలో భూమండలాన్ని కాపాడుతున్నాడు. ఆయన అంతర్ముఖుడై తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పక్కనే యాగాశ్వం గడ్డి మేస్తూ కనిపించింది ఆ సగరులకు. ఈయనే యాగాశ్వాన్ని దొంగలించాడని భావించి కత్తులు దూసి ఆయన మీదకు దూకారు. కపిల మహర్షి కళ్ళు తెరచి ఒక హుంకారం చేశారు. అంతే ఆ అరవై వేలమందీ భూడిద రాశులైపోయారు. 
ఆ అరవై వేలమంది సగరులను వెతుకుతూ ఆంశుమంతుడు ఇలాతలము దాటి పాతాళమునకు   చేరుకున్నాడు. ఆ పాతాళములో ఆ సగరుల యొక్క భూడిద రాశులను చూసి బాధపడ్డాడు. వారికి జలాలలో తర్పణము ఇవ్వడానికి పూనుకోగా అంశుమంతుని యొక్క మేనమామ అయిన గరుత్మంతుడు  సగరులకు మామూలు జలాలతో తర్పణము ఇస్తే అందదనీ, గంగతో తర్పణము ఇస్తేనే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పాడు.  పిదప అంశుమంతుడు, అతని తరవాత అతని  కుమారుడు దిలీపుడు గంగను భువికి తీసుకొని రాడానికి ప్రయత్నించి విఫలులైనారు.  
హిమవంతునికి ఇద్దరు కుమార్తెలు ఒకరు గంగ, ఇంకోరు ఉమ. గంగను దేవకార్య నిమ్మిత్తము దేవతలకు ఒసంగాడు హిమవంతుడు.   
ఆ తరవాత దిలీపుని కుమారుడు భగీరథుడు నెలకొక సారి ఆహారం తింటూ, పంచాగ్నులలో నిలబడి  గంగ కోసం ఘోర తపస్సు  చేశాడు.  మొదట బ్రహ్మ ప్రత్యక్షమై  ఏమని కావాలో కోరుకొమ్మని అడిగాడు. భగీరథుడు తన పిత్రులకు  ఉత్తమగతుల కోసం దివి నుండి గంగ భువికి రావాలని, తనకి పుత్రులు కావాలని కోరుకున్నాడు. అందుకు బ్రహ్మ ఆకాశ గంగ భువికి జారినప్పుడు ఆ గంగను పట్టుకొనే వాడు ఒక్క శివుడే కాబట్టి శివుడు కనుక  గంగను పడతానంటే  దివిలో ఉన్న గంగను భువికి పంపుతానని చెప్పాడు. 
భగీరథుడు మళ్ళీ శివుని గురించి తపస్సు చేశాక శివుడు అనుగ్రహించి గంగను పట్టుకొనడానికి అంగీకరించాడు. హిమాలయాల దగ్గర  గంగను పట్టుకోడానికి నడుము మీద చేయి వేసుకొని జటాజూటాలను విప్పి నిలబడ్డాడు శివుడు. గంగ అహంకరించి దూకడంతో శివుడు గంగను తన జటాజూటం లో బంధించేశాడు. మళ్ళీ భగీరథుడు శివుని గురించి తపస్సు చేసి గంగను వదలమని వేడుకొన్నాడు. శివుడు ఆ గంగను హిమాలయాలలో బిందు సరోవరములో పడేటట్టుగా చిన్న ధారగా వదిలాడు. ఆ శివుని శరీరాన్ని తాకి పవిత్రురాలైన ఆ గంగ "భవాంగ పతితం తోయం"గా ప్రసిధ్ది గాంచింది. 
శివుని జటాజూటాల నుండి జారిన ఆ ధారలో మూడు పాయలు(లాదిని,నళిని, పాదిని)   తూర్పు దిక్కుగా ప్రవహించాయి, మూడు పాయలు(సుచక్షువు,సీత, సింధు) పశ్చిమంగా  ప్రవహించాయి. ఇంకో పాయ భగిరథుని వెనుక ప్రవహించింది. ముందు భగీరథుడు రథము మీద వెళ్తుంటే రంగ తుంగ తరంగాలతో పరవళ్ళు తొక్కుతూ  వెనుకాల ప్రయాణించింది. దారిలో జహ్ను మహర్షి ఆశ్రమం మీదుగా వెళ్తూ ఆ ఆశ్రమాన్ని ముంచి వేసింది.  కోపించిన ఆ మహర్షి గంగను అవపోశన పట్టేశాడు.  వెనుకకు తిరిగి భగీరథుడు చూస్తే అక్కడ గంగ లేదు. మళ్ళీ అతను ఆ జహ్ను మహర్షి ని ప్రార్ధించగా ఆయన శాంతించి గంగను అతని కుడి చెవిలో నుండి వదిలాడు. జహ్ను మహర్షి చెవిలో నుండి వచ్చినది కాబట్టి గంగ 'జాహ్నవి'గా పేరుగాంచింది.  మళ్ళీ భగీరథుని వెనుక ప్రయాణించి పాతాళములో ఉన్న అరవై వేల మంది సగరుల భస్మ రాశుల మీదుగా ప్రవహించి వారికి ఉత్తమ గతులు ప్రసాదించింది. 
ఆకాశములో ప్రవహించే గంగ మందాకినిగా, భగీరథుడు భువికి తీసుకొని వచ్చినందుకు భగీరథిగా, పాతాళములో ప్రవహించినందుకు భోగవతిగా పేరుగాంచింది.  ఈ విధంగా ఆకాశము, భూలోకము, పాతాళము మూడులోకాలలో ప్రవహించి పునీతము చేస్తూ గంగ 'త్రిపధ'గా ఖ్యాతిగాంచింది.   

No comments:

Post a Comment