Monday 19 May 2014

దేశప్రగతికి హిందుత్వమే మూలసిద్ధాంతం

భారతదేశ చరిత్రను గమనిస్తే మహాభారత సంగ్రామం దేనికోసం జరిగింది? రామ-రావణ యుద్ధం దేనికోసం జరిగింది? దేవదానవుల సంగ్రామం దేనికోసం జరిగింది? ఆ యుద్ధాలన్నీ ధర్మసంరక్షణ కోసం జరిగాయి. భారతదేశ ప్రజల కర్తవ్యం ధర్మసంరక్షణ. అందుకే ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం లభిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత: - ధర్మాన్ని ఎవరు ఆచరిస్తూ కాపాడుతుంటారో వారిని ధర్మం కాపాడుతుందని చెబుతారు. ధర్మ సంరక్షణ కోసం సమాజం శక్తివంతంగా ఉండాలి. ప్రజలలో విజిగీష ప్రవృత్తి నిర్మాణం కావాలి. భారతదేశం శక్తివంతంగా ఉన్నప్పుడు ఏ కాలంలోనైనా ప్రపంచంలో శాంతి స్థాపించబడింది. భారతదేశం శక్తివంతంగా ఉన్నప్పుడు మన ఎల్లలు హిమాలయ పర్వతాల ఆవలివైపు ఉండేవి. ఈ దేశం ఎల్లలు ఎందుకు కుంచించుకుపోయాయంటే - హిందూసమాజం బలహీనమైంది. అందుకే దేశం అనేక సమస్యలు ఎదుర్కొన్నది, ఎదుర్కొంటున్నది. ఈ దేశంలో సమస్యల పరిష్కారానికి ఈ దేశం శక్తివంతం కావాలి, ధర్మం కాపాడబడాలి. అదే విజయదశమి పండుగ మనకిచ్చే సందేశం. ధర్మ సంరక్షణ కోసం దుర్గామాత దుర్మార్గులను సంహరించింది. ఆ దుర్గామాతను హిందూ సమాజం ఆరాధిస్తున్నది.  

హిందూ సమాజ సంఘటన కోసం భారతదేశంలో 1925వ సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘము ప్రారంభించబడింది. బ్రిటిష్ వాళ్లు ఈ దేశాన్ని పాలిస్తున్న రోజులలో స్వాతంత్ర్య పోరాటంలో ఉత్సాహంగా పాల్గొన్న డా.కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ అనేక అనుభవాల తరువాత విజయదశమి పండుగ రోజున హిందూ సమాజ సంఘటనా కార్యాన్ని ప్రారంభించారు. హిందూసమాజ సంఘటనా కార్యం గురించి డాక్టర్ జీ కంటే ముందుకూడా అనేకమంది చెప్పారు. "హిందూ సమాజ సంఘటన ఏ మార్గంలో చేయాలో తమదైన శైలిలో అనేకమంది చెప్పారు. స్వామి వివేకానంద కూడా ఈ విషయం ప్రస్తావించారు. హిందుత్వ ఆలోచనలకనుగుణంగా పని జరగాలి. హిందుత్వమే ఈ దేశం యొక్క ప్రాణం. హిందుత్వ జీవన విధానమే ఈ దేశాన్ని కాపాడేది. హిందుత్వ ఆలోచనలలో ఈ చరాచరసృష్టిని కాపాడే లక్ష్యం ఉన్నది.  

ఈ రోజున పర్యావరణ సమస్య ప్రపంచవ్యాప్తంగా కనబడుతున్నది. పర్యావరణ సమస్య పరిష్కారానికి కావలసిన ఆలోచనలు మన జీవన విధానంలో ఉన్నాయి. ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న మరో సమస్య అనైతికత. అంటే నైతిక విలువల పతనం. నైతిక విలువలను కాపాడాలంటే మన జీవనం ఎట్లా ఉండాలో హిందుత్వ జీవనంలో చెప్పబడింది. ఈ రోజు ప్రపంచము ఎదుర్కొంటున్న మరో సమస్య కుటుంబ జీవనం బలహీనం కావటం. కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలో మన జీవన విధానం చెబుతుంది. ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం లాగా ఉండాలని వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో చెప్పబడుతూ వస్తున్నది. అంటే కుటుంబ జీవనము ఎంతో ఆదర్శవంతమైనది. వ్యక్తి జీవనం దేనిని సాధించేందుకు? అని అంటే చతుర్విధ పురుషార్థ సాధన కోసం అని చెప్పబడేది. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాల సాధన. అంటే ధన సంపాదన, కొన్ని పరిధులలో భౌతిక సుఖాలను అనుభవించటం. అంతిమంగా మోక్ష సాధన చేయాలి. ఈ విషయాలన్నీ మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. ఈ రోజున ప్రపంచం "భౌతిక సుఖాలను అనుభవించటమే సర్వస్వము, దానికోసం ధన సంపాదనే ఏకైక మార్గం" అనేలాగా సాగుతున్నది. ఇది అనేక అనర్థాలకు కారణమవుతున్నది. దానికి పరిష్కారాన్ని హిందుత్వ జీవన విధానం సూచిస్తున్నది. ఈ రోజున మతాలమధ్య సంఘర్షణ, మా మతమే గొప్పది అనే ఆలోచనలు ప్రపంచ శాంతికి ఆటంకంగా ఉన్నాయి. దానికి సరియైన దిశాదర్శనము హిందుత్వ జీవన విధానంలో ఉన్నది. భగవంతుడు ఒక్కడే. అతనిని చేరుకోవటానికి అనేక మార్గాలు ఉంటాయని దర్శించిన దేశం భారతదేశము. ఇట్లా ఆలోచిస్తే ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారము హిందుత్వ ఆలోచనలలో ఉన్నది. హిందుత్వ ఆలోచనే సంఘ ఆలోచన. ఈ ఆలోచనతో గడిచిన 88 సంవత్సరాల నుండి సంఘం పనిచేసుకొంటూ వస్తున్నది. దేశంలో ఎంతోమార్పు తీసుకొని వచ్చింది. హిందుత్వ ఆలోచనలను ఈ దేశంలో పదేపదే చెప్పవలసి అవసరం ఉంది. హిందూ ఆలోచన అర్థం కావాలంటే ఆంగ్లేయులు ఈ దేశంలో ప్రచారం చేసిన తప్పుడు విధానాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మన గురించి మనకు తెలుస్తుంది.  

సంఘ ఆలోచన హిందూ ఆలోచన. అంటే సనాతనమైన ఆలోచన. సంఘము ఒక సంస్థ కాదు, సమాజం లేదా రాష్ట్రం. ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటించటం మంచింది. సంత్ రామ్ దాస్ "చెప్పవలసిన విషయాన్ని పదేపదే చెప్పాలి" అని అన్నారు.  

హిందూ ఆలోచన అర్థం కావాలంటే ముందు ఆంగ్లేయులు మనపై రుద్దిన తప్పుడు విషయాలను మరచిపోవాలి. "మురికి బట్టలకు రంగు వేయాలంటే ముందు వాటిని ఉతికి శుభ్రం చేయాలి". "హిందువులో ఆత్మవిశ్వాసం లుప్తం కావడం కొరకు దేశచరిత్రను వక్రీకరించి వ్రాశారు. పాశ్చాత్య దేశాల చరిత్ర గతిలో వచ్చిన వికాసమే మిగతా దేశాల చరిత్రల్లో వచ్చినట్లు వ్రాశారు. ఇక్కడ నిరంకుశ రాజరికము లేదు, ఫ్యూడలిజం లేదు. కాని ఈ రెండు మన దేశంలో ఉన్నట్లు చెప్పారు. మనదేశంలో రాజరికము విదేశీయుల ద్వారానే వచ్చింది. ఫ్యూడలిజం కార్న్ వాలీస్ ప్రవేశపెట్టిన సెటిల్మెంట్ చట్టం ద్వారా వచ్చింది.  

రెలిజియన్ అనే పదానికి అర్థం "ధర్మం" అని అన్నారు. పశ్చిమ దేశాలలో మతానికి ఉన్న అర్థాన్ని ఇక్కడి "ధర్మం"తో పోల్చారు. ఐరోపాలోని చర్చి పాత్ర ఇక్కడి పురోహిత వ్యవస్థకు భిన్నమైనది. అక్కడి చర్చి సంఘటితమైనది. దాని ప్రభావం సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాలపై ఎక్కువగా ఉండేది. ఇచట అట్లా ఎప్పుడూ లేదు. చర్చికి విరుద్ధంగా వచ్చిన తిరుగుబాటులాంటిది ఇక్కడ లేదు. ఇక్కడ అన్ని మతాలకు స్వతంత్రత ఉండేది. అన్నింటి మధ్య సమన్వయము ఉండేది.  

బ్రిటిష్ వాళ్లు మరో ఆలోచన కూడా వ్యాప్తి చేసారు. హిందువుల వద్ద ఏమి లేదని, అన్నీ పశ్చిమ దేశాల నుండే నేర్చుకోవాలన్నట్లు చెప్పారు. మన ప్రగతికి "పశ్చిమం" ఆదర్శం అయింది. ఈ భ్రమలు తొలగిపోనంత వరకు మన ఆలోచనా పద్ధతి అవగాహనలోకి రాదు.  

పాశ్చాత్యుల ఆలోచన ప్రకారము ఒక సమాజపు ఆర్థిక, సామాజిక వ్యవస్థలు చక్కదిద్దబడితే అందలి మనుష్యుల మనస్సులు కూడా అదే విధంగా చక్కబడతాయి. మనం సమాజ వ్యవస్థకు ప్రాముఖ్యతనిస్తూనే మానవుని మనస్సు స్వతంత్రమైనదని గుర్తించాము. శాశ్వతమైన సిద్ధాంతాలకు దెబ్బతగలకుండా వ్యవస్థలను మార్చుకొన్నాము. దాని ఫలితంగా అనేక స్మృతులు తయారయినాయి. 

మానవుని మనస్సు సంస్కారవంతంగా లేకపోయినట్లయితే సామాజిక వ్యవస్థ సక్రమంగా జరిగినప్పటికీ అది చెడు ఫలితాలు ఇవ్వవచ్చు. కావున మనస్సు సంస్కారవంతం చేయాలనే విషయం చెప్పబడింది.
పాశ్చాత్య ఆలోచనతో మన ఆలోచనను పోల్చి చూసుకొనే సమయము నేడు ఆసన్నమైంది.   

రష్యాలో విప్లవం తరువాత ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సమాజ రచన జరిగినప్పటికీ అక్కడ అవినీతి, విశృంఖలత పెచ్చుపెరుగుతూనే ఉన్నాయని ఆ రోజుల్లోనే బ్రెజ్నేవు అంగీకరించారు. కాని ఈ రెండు దుర్గుణాలు పెట్టుబడిదారి విధానం వల్ల సంక్రమించాయనే అంటుంటారు. అది వేరే విషయం. చైనాలో సాంస్కృతిక విప్లవం జరుగుతున్న సమయంలో మావో ఇలా అంటాడు "నేటి విప్లవకారులే 15-20 సంవత్సరాల తరువాత స్వార్థాలు పెంచుకుని విప్లవ ప్రతిఘాతకులుగా మారతారు. ఇటువంటి వారిని నాశనం చేయటానికి 'నిరంతర విప్లవం' అనే సిద్ధాంతము ప్రతిపాదించారు.  

సామాజిక వ్యవస్థ నిర్మాణం కన్న మానవుని మనస్సు ప్రధానమైనదని తెలుస్తున్నది. ఒక సమాజపు స్వభావము, సంస్కృతి, పరిస్థితులు జీవన మూల్యాలు మొదలైనవి ఆ సమాజ వ్యవస్థను నిర్మాణం చేయటంలో గమనించవలసిన విషయాలు. రోగాన్ని గురించి తెలుసుకొన్న తరువాతనే ఒక మందు దానికి మంచిదో కాదో చెప్పగలము. అట్లాగే సమాజాన్ని పరిశీలించిన తరువాత సమాజ వ్యవస్థ గురించి చెప్పగలము.  

పాశ్చాత్యుల భావన భౌతికవాదం అయినందువల్ల వారి ఆలోచనాధోరణి లోలకం ఒకవైపు నుండి మరోవైపుకు ఊగుతూ ఉంది. రాజరికం నుండి పూర్తిగా ప్రజాస్వామ్యం వైపు ప్రజాస్వామ్యం వైపు నుండి కమ్యూనిజం వైపు ఊగుతున్నది. ఒకవైపు క్లబ్లుల్లాంటి పద్ధతి - దానిలో వ్యక్తే సర్వస్వము. మరోవైపు యంత్రం లాంటి పద్ధతి - దీనిలో వ్యక్తి కేవలం చీలగా మాత్రమే ఉంటాడు.  

మనం సమాజాన్ని పురుషునిగా భావించాము. ఆ సమాజంలో వ్యక్తి ఒక అవయవంలాంటివాడు. ఉదాహరణకు - సహస్రశీర్ష:పురుష:  

అచంచల ఆలోచన మనలో లేదు. సమగ్ర చింతన ఉన్నది. మానవుడు అంటే శరీరము, మనస్సు, బుద్ధి. వీటన్నింటి గురించి ఆలోచించటం జరిగింది.  

పశ్చిమంలో వ్యక్తి యొక్క ఆస్తి హక్కు పూర్తిగా అనియంత్రితమో లేదా ప్రభుత్వ నియంత్రితమో అయి ఉంటుంది. మనదేశంలో ఉదర పోషణకు అవసరమైన ఆస్తిపై అధికారమున్నది. అందుకే "వంద చేతులతో సంపాదించు - వెయ్యి చేతులతో పంచు" అని అధర్వణ వేదంలో చెప్పబడింది.   

పాశ్చాత్యుల ఆలోచన పద్ధతి ప్రకారం మిగులు విలువ పూర్తిగా వ్యక్తికో లేక పూర్తిగా సమాజానికో చెందుతుంది. మన ఆలోచన "కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన". అంటే కర్మఫలం పైన మనకు అధికారం ఉందికాని మిగులు విలువపైన లేదు. దానిని దానం, యజ్ఞం మొదలైన వాని ద్వారా సమాజానికి వినియోగించాలి.  

యాంత్రిక విజ్ఞానం, అణు విజ్ఞానం కారణంగా భ్రదతకు బదులు భయం పెరుగుతోంది. పాశ్చాత్య దేశాలలో శాస్త్రజ్ఞులు కేవలం శాస్త్రీయ పరిశోధన గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కాని దాని ప్రభావం సమాజంపై ఎట్లా ఉంటుందనేది ఆలోచించటం లేదు.  

పాశ్చాత్య దేశాలకు చెందిన ఇట్టి భ్రమల నుండి బయటపడినప్పుడు మాత్రమే మనం మన ఆలోచనా పద్ధతిని అర్థం చేసుకోగలుగుతాము. అప్పడే మనదేశ ప్రగతి సాధ్యం. సంఘం ఆ దిశలోనే పనిచేస్తున్నది

No comments:

Post a Comment