Sunday 25 May 2014

మానస సరోవరము మరియి కైలాస పర్వత యాత్ర

రచన: ఇమడాబత్తుని వెంకటేశ్వర రావు
2006 జున్ నెలలో ఉద్యోగమునుంచి రిటైరు అయ్యాను. ఉద్యోగము చేసే రోజుల్లో విహార యాత్రలకు, పుణ్యక్షేత్రాలను దర్శించడానికి దొరికే సెలవులు తక్కువ గనుక, నచ్చిన యాత్రలకు 2006 నుండి ప్రతి సంవత్సరము ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకున్నాము. నా శ్రీమతి అంజలి కూడా రిటైరు అవడము మూలంగా ఇద్దరికి యాత్రలకు వెళ్ళడానికి బాగా కుదిరింది. ఆస్త్రేలియా, స్కాట్లండు, మరియి ఈజిప్టు దేశాలు ముందుగా దర్శించిన తరువాత పుణ్య తీర్ధాలు, దేవాలయాలు, చారిత్రాత్మక కట్టడాలు, దేవతల నివాస స్థలాల వైపు దృష్టి మళ్ళింది.

మానస సరోవరము అత్యద్భుతమైన, విశాలమైన (చుట్టు కొలత ౧౦౬ కి.మీ) సరస్సు వాల్మీకి రాసిన రామాయణంలో ఈ సరస్సు బ్రహ్మదేవుడు తన మనసులో సృష్టించినాడని వ్రాశాడు. బ్రహ్మ మనసునుండి పుట్టినది గనుక మానస సరోవరము అనడము జరిగినది. ఈ సరోవర మహిమల ప్రసిద్ధి వాసికెక్కినది. దేవతలు ఈ సరోవరములో స్నానము చేయడానికి స్వర్గలోకమునుండి ప్రతి రాత్రి వస్తుంటారని, పండుగ రోజుల్లో, నిండు పున్నమి రాత్రులలో తప్పక వస్తారని ప్రతీతి. తమ నిజ రూపములో రావడం, పది మందికి కనిపించడము ఇష్టము ఉండదు గనుక వారు నక్షత్ర రూపములో వచ్చి సరోవర ప్రాంతములో విహరించి, జలకములాడి తిరిగి వెళ్తారని అనుకోవడము నిజము. విష్ణుమూర్తి, లక్షిదేవి శేషతల్పము మీద ఈ సరస్సులో అపుడపుడు కనిపిస్తారని కూడా విన్నాము. ఈ సరస్సు కైలాస పర్వతానికి చాలా దగ్గరగా ఉండడము మూలంగా శివుడు నటరాజుగా సరోవర తటాన్ని దర్శించి ఆనంద తాండవము చేస్తాడని కూడా ప్రతీతి. అలాంటి మహాత్మ్యము కలిగిన సరోవరాన్ని దర్శించాలని, అందులో జలకాలాడి పునీతులము కావాలని ఎన్నో రోజులనుండి కోరిక.

అంత దూరము వెళ్ళినపుడు శివపార్వతులు నివసించే కైలాస పర్వతాన్ని కూడ దర్శించాలనే పట్టుదల ఈ విహారానికి నాంది పలికింది. ఈ పర్వత శిఖరాన శివుడు పార్వతి, కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నది తదితర ప్రమధగణాలతో నివసిస్తారని, ఈ పర్వతాన్ని ఎక్కగలిగితే వచ్చే పుణ్యము పునర్జన్మ లేకుండా చేస్తుందని, మృత్యువును జయించినట్లేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పార్వాతీదేవికి జన్మనిచ్చిన పర్వతరాజు మేరు, మహారాణి మేనక నివాసము కూడా ఈ పర్వతశ్రేణిలో ఉండడం వలన ఈ విహారము వలన పుణ్యము, పురుషార్ధము కలసి వస్తుందని కోరిక మరీ బలపడింది.

ఈ రెండు సుప్రసిద్ధ, చారిత్రాత్మక, ఆద్యాత్మిక స్థలాలు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండడము మూలంగా అందరికి వీలుపడదు. కైలాస శిఖరము పూర్తి ఎత్తు ౨౧,౦౦౦ అడుగులు. ఐతే మానవమాత్రులు పోగలిగిన ఎత్తు ౧౯,౦౦౦ అడుగులు మాతమే. ఆ చివరి రెండువేల అడుగుల ఎత్తున ఉన్న పర్వత శిఖరము ఎప్పుడూ తెల్లని మంచుతో నిండి వుంటుంది. శివుని దర్శనము ఈ మానవ సహజమైన శరీరానికి అందనిది. శివుడు గాని, విష్ణుమూర్తి కాక ఇంకే దేవున్నైనా చేరాలంటే మన శరీరమేకాక, మనస్సుకూడా నిర్మలమై, దైవభక్తితో పునీతమై వుంటేనే వీలు పడుతుంది. అంటే ఆధ్యాత్మికంగానే వీలు పడుతుంది. ఆ అదృష్టము కొందరు మహాత్ములకే వీలుపడుతుంది. మనలాంటి మానవ మాత్రులకు కనీసము పర్వత ప్రాంగణము. పర్వత శ్రేణి పైకి వెళ్ళగలిగితే ఆ అదృష్టమే చాలుననే కోరిక మనలను ఈ ప్రయత్నానికి పురికొల్పుతుంది.

మనకు ౧౦ నుండి ౧౨ వేల ఆడుగుల ఎత్తు వెళ్ళిన దగ్గరనుండి ప్రాణవాయువు (ఆక్సిజన్) తక్కువౌతున్న విషయము తెలుస్తుంది. మానససరోవరము కూడ ౧౪ వేల అడుగుల ఎత్తులో వున్న సరస్సు. వీటిని దర్శించాలంటే పుణ్యము చేసి వుండాలనే విషయము కాక, శరీరానికి తగిన వ్యాయామము కూడ చేసి వుండాల్సిన అవసరము వుంది. ఈ యాత్ర మొదలుపెట్టే ముందు కనీసము ౩ నుండి ౬ మాసములు వరకు ప్రాణాయామము, యోగాసనములు, కొండలు గాని గుట్టలు గాని ఎక్కిన అనుభవము, పూర్తి ఆరోగ్య నియమాలు పాటిస్తున్న శరీరము కావాలి. ఈ ౧౫ రోజులకు చలికి, వీచే చలి గాలులకు, మంచు పర్వతాలకు, ఏర్పాట్లు సరిగా లేని వసతి గృహాలకు, నడుములు కుదించే కంకర రోడ్లమీది వాహన యాత్రలకు ఒళ్ళు హూనమై మీ ఓర్పును పరిక్షిస్తాయి. గుండె నొప్పి కాని, గుండెకు మరే జబ్బైన ఉన్నవారు ఈ యాత్రకు సాహసము చేయవద్దని తేల్చి మరీ చెప్పుచున్నారు. పోదలచుకున్న వారెవరైనా వైద్య పరీక్షల తర్వాత డాక్టరు సలహా పాటించి చేయగలమన్న నమ్మకము ఉంటే తప్ప ఈ యాత్ర చేయకూడదు.

ఈ యాత్ర రెండు విధాలుగా చేయవచ్చు. భారత ప్రభుత్వము ద్వారా ఏరాటు చేసిన యాత్ర టిబెటు దేశములోనున్న పై రెండు పుణ్యక్షేత్రాలను భారతదేశము ఉత్తరపుటెల్లలనుండి వెళ్ళవచ్చు. కాని ఈ యాత్ర నెల రోజులు పట్టడమే గాక పర్వతశ్రేణి మీద నడవడము చాల ఎక్కువగా వుంటుదని అంటారు. రెండవ మార్గము కాట్మండు, నేపాలు మీదుగా నేపాలు దేశ సరిహద్దులు దాటి టిబెటు ప్రవేశించి వెళ్ళవలసి వుంటుంది. ఈ యాత్ర విహరణ యాత్రల ఏజన్సీ ద్వారా వెళ్తే వీసాలు, వసతి గృహాలు, బస్సులు, జీపులు, గుర్రములు తదితర వసతులన్ని వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఈ యాత్ర వివరాలన్ని విశదంగా రాయాలంటే చాలా సమయము కావలసి వస్తుంది గనుక ఒక్కొక్క మెట్టుగా తెలుసుకుందాము.

౧. నేపాల్ నుండి టిబెట్ సరిహద్దులోనున్న న్యాలమునకు ౧౦ గంటైల ప్రయాణము బస్సులో గడిపాము. నేపాల్ దేశము ప్రకృతి సౌందర్యము చెప్పనలవి కాదు. రోడ్డుకు ఇరు వైపుల ౧౦౦ అడుగుల ఎత్తైన వృక్షాలు బారులుదీరినట్లు వున్నాయి.  కొండలు, పర్వతశ్రేణులు ౩ వేల అడుగులనుండి ౧౨ వేల అడుగుల వరకు చేరాయి. ఆ కొండలలో నుండి సెలయేరుల, వాగులు, నదులు, కొండలలోనుండి క్రిందకు దూకుతుంటే ఆ దృశ్యాలు చూడడానికి కళ్ళు చాలవు. దేవుడు ఆ ప్రాంతాన్ని అంత అందంగా సృష్టించాడు. బహుశా ఇదే మొదటిది, మరల చివరి దృశ్యము అయింది ఈ మొత్తము యాత్రలో. ఒకసారి టిబెటు చేరిన తర్వాత కొండపైన చెట్టు చేమలు ఏమి లేవు. కారణము ప్రాణవాయువు తక్కువవడమే. కొండలన్ని బోడిగా, పచ్చదనముకోసము గోడు గోడున విలపిస్తున్నాయి. న్యాలములో ఆ ఎత్తును అలవాటు చేసికోవడానికి ఒక రోజు ఆగాలి. ఆక్సిజన్ తక్కువ వుండడము మూలంగా పీల్చడానికి సరిపోతుందంతే అలసిపోతే గాలి దొరకడము కష్టము.

౨. న్యాలమునుండి సాధారణంగా యాత్రికులు ’సాగా’ పట్టనములో బసచేస్తారు ౮ గంటల ప్రయాణము తర్వాత మా యాత్ర నడుపుతున్న సుపర్ వైజర్ మమ్ములను ’దెంగ్‍పా’ అనే గ్రామమువరకు తీసికొని వెళ్ళాడు. అచటినుండి మరల ’పర్యాంగ్’ గ్రామములో ఆగకుండా మానససరోవరానికి వెళ్ళి రెండు రాత్రులు విశ్రాంతి తీసికొనే వుద్దేశముతో ఈ ఏర్పాట్లు చేయవలసి వచ్చింది.

౩. దెంగ్‍పా నుండి ప్రొద్దున్నే బయలుదేరి మానససరోవరము వైపు బయలుదేరాము. ఈ ప్రయాణములో రోడ్లు విశాలంగా బాగా ఉన్నాయి. మానససరోవరము యింకా ౧౦ మైళ్ళు ఉందనగానే కైలాస పర్వత శిఖరము, విశాలమైన సరోవరం మాకు కన్నులకు కట్టినట్లుగా కనపడింది. ఆ దృశ్యాలు చూడగానే మా హృదయానందము చెప్పనలవికాదు. మనస్సు ఎపుడెపుడు చేరుతామా, సరోవరాన్ని ఎప్పుడు తిలకిస్తామా అనే ఉత్కంట ఎక్కువ కాసాగింది. ౩౦ నిమిషాలలో సరోవర తీరము చేరాము. చాలా మంది యాత్రికలు ఆరోజు రావడము ఒడ్డున గుడారములు వేసికొన్నాము. కాకపోతే ఆ చల్లని (౩౦ డెగ్రీలు ఫారెన్‍హీట్), గంటకు ౨౦ మైళ్ళ వేగంతో వీచే గాలులకు గుడారాలు ఊగిపోయాయి. ఆ సాయంత్రము కొంతమంది పవిత్ర సరోవరములో స్నానాదులు ఆచరించడానికి వెళ్ళారు. సరోవరము చాలా నిర్మలంగా, విశాలంగా నీలవర్ణంలో ఉన్న సముద్రమా అనిపిస్తుంది. అలలు లేకుండా మెరుస్తూ కనిపించే జలరాశిని చూస్తుంటే అలా కూర్చుండిపోవాలని పించింది. ఆ జలాశయము చుట్టు కొలత ౧౦౮ కి.మీ. లోతు బహుశా ౧ కి.మీ. వుండవచ్చు (లోతైన చోటు), సరోవరము మీద ఎవరూ పడవలలో వెళ్ళకూడదు. స్నానము చేయాలంటే నదిలో దూకి ఈతలు కొట్టినట్లు చేయలేము. చలికి రక్తము గడ్డకట్టవచ్చు. తిరుపతి కోనేటిలో మునక వేసి బయటికి వచ్చినట్లు ఒకటి రెండు మునకలు వేయగలిగితే గొప్పే. కాకపోతే ఆ రెండు నిమిషాల కాలములో సంపాదించుకున్న పుణ్యము అమోఘమైనది. తీర్ధము తీసికొంటేనే అదృష్టము అన్నమాట. మేము సరోవరములో స్నానము చేయడం అంటే మహా అదృష్టము అన్నమాట. మేము పున్నమి రాత్రి అచ్చటకు చేరాము. ఆ రోజు కొందరికి  నక్షత్రాలు మూడవ ఝామున సరోవరములో రాలుతున్నట్టు కనిపించాయి.

రెండు రాత్రులు సరోవర తీరాన వుండి ౪౫ మంది లో ౩౦ మంది కైలస పర్వతము ఎక్కడానికి బయలుదేరినాము. సరోవరము ౧౪,౫౦౦ అడుగుల ఎత్తు ఉంది. కైలాస పర్వతము ౧౫,౦౦౦’ నుండి ౧౯,౦౦౦’ ఎత్తు వరకు వెళ్ళవచ్చు. మూడు రోజులు పడుతుమ్ది ఎక్కి దిగడానికి. పైకి వెళ్ళే వాళ్ళకు ఆక్సిజన్ సిలిండరు ఇస్తారు.  కావాలంటే గుర్రాన్ని, గుర్రము నడపడానికి ఒక రౌతు, సామాను తేవడానికి ఒక షెర్సాను కూడ డబ్బు ఇచ్చి ఏర్పాటు చేసికొనవచ్చు. యువకులకు, ఆరోగ్యవంతులకు కాలినడక సరిపడవచ్చు. కాని అలసట కలిగితే మాత్రము గాలి దొరకదు. అందువలన నేను అశ్వాన్ని అద్దెకు తీసికొన్నాను. మనము కొంతవరకు నడచినా అలసట అనిపిస్తే గుర్రము ఎక్కవచ్చు. దారిలో మాంధాత పర్వత శ్రేణిలో కొంతదూరము పయాణించాము. ’రాక్షసతాల్’ అనే సరోవరాన్ని చూశాము. ఇచ్చట రావణుడు శివుని గురించి తపస్సు చేశాడు. ఆ నీళ్ళు ఎవరూ ముట్టరు. డర్బెణ్ అనే గ్రామములో బస దిగాము. ప్రక్కనే యమ ద్వారము అనే కట్టడము వుంది. ఆ ద్వారము ఒక ప్రక్కనుండి వేరొక ప్రక్కకు వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణ చేస్తే మృత్యువును జయించినట్టి అమి చెపుతారు. తార్కాణము ఏమిటంటే అది దాటుతూనే మనము కైలాస పర్వతము మీద కాలు పెడ్తున్నాము. కైలాస పర్వతము శివుని కొండ కనుక యముడు దగ్గరకు రాలేడు. ఆ ధైర్యముతో, శివ పార్వాతుల స్మృతులతో భజనలతో కొండ ఎక్కుతుంటే ఆ ఆనందము వర్ణనాతీతము. కొండమీద గుడి లేకపోవచ్చు. గుడిలో విగ్రహాన్ని చూసేకన్నా సాక్షాత్తు శివ పార్వతులు నివసిస్తున్న కొండను దర్శించి, ఆధ్యాత్మికంగా వారిని దర్శించే అదృష్టము కన్నా వేరేమి కావాలి? కైలాస పర్వతము పరిక్రమణ మూడు రోజులు పడుతుంది. మొత్తము దూరము ౪౮ కిలోమీటర్లు. రెండు రోజులలో పర్వత శిఖరము వరకు చేరవచ్చు. శిఖరము అంచు ౧౯,౦౦౦ అడుగులు మాత్రమే మొదటి రోజు ౧౩ కి.మీ. కొండ పైకి ఎక్కాము. కొందరు యువకులు కాలినడకనే పైకి వెళ్ళడము మొదలు పెట్టారు. నేను కూడ సుమారు ౫౦ సంవత్సరాల క్రితము వుత్సాహముతో కొండలెక్కాను. కాని ఇప్పుడు మాత్రము అశ్వారోహణము చేశాను. దీరపుక్ అనే వూరిలో రాత్రి బస సేశాము. పడుకోవడానికి మట్టి అరుగుల మీద పరువులు వేసి ఇచ్చారు. మాతో వచ్చిన వంటవాళ్లు వండి వార్చేశారు. తిని, చలికి నాలుగు జతల బట్టలు వేసికొని రెండు గొంగళ్ళు మీదకప్పుకుని పడుకొన్నాము.

ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకోడానికి చెట్లలోకి పోవలసి వచ్చింది. మరల ఉపాహారముల తరువాత కొండ ఎక్కడము మొదలు పెట్టాము. ఈ రోజు కొండ మీదికి ౧౫ కెలోమీటర్లు ఎక్కాలి. డొల్మాలాపాస్ కొండ లోయల్లో, కొండ అంచుల్లో ప్రయాణము చేస్తూ, భజనలు చేస్తూ, శివున్ని ప్రార్ధిస్తూ కొంద మీదికి చేరాము. ప్రమాద చిహ్నాలు ఏవీ కనిపించలేదు. కైలాస శిఖరాన్ని ఎక్కుతున్నామన్న సంతోషము, ఆనందము మమ్ములను వుక్కిరి బిక్కిరి చేసింది. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కె ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినపుడు ఎంత సంతృప్తి పొందారో మాకు కైలాస శిఖరము ఎక్కినపుడు అంత సంతోషము అయింది. జీవితములో అంతకన్న సధించ వలసినదేమి లేదన్నంత ఆనందము కలిగింది. ఆక్సిజన్ ఇబ్బంది ఏమి కలుగలేదు. ౧౯,౦౦౦ అడుగుల ఎత్తు చేరగానే నిలబడి నలుదిక్కులూ చూశాము. శివ నామాన్ని జపించి మరల పర్వతారోహణకు సిద్ధపడ్డాము. శిఖరము పైన ౫ నిమిషాలకన్నా ఎక్కువసేపు వుండడము ప్రమాదకరమని, ఆక్సిజన్ చాలని కారణంగా విపత్తు రావచ్చునని ముందే యాత్ర పర్యవేక్షకులు చెప్పియున్నందున వెంటనే క్రిందికి దిగటానికి నిశ్చయించుకున్నాము. ౩౦ మంది యాత్రికులము సుమారు ఒకే గంటలో పర్వతారోహణ మొదలు పెట్టినా, ఎవరి ఓపికనుబట్టి వాళ్ళు వేర్వేరు సమయములలో
శిఖరారోహణము చేయడము జరిగింది. నాతోపాటు నా సహాయకులిద్దరు, మరో ఇద్దరు యాత్రికులు ఒకేసారి శిఖరము మీదకు చేరాము. మాధవి అనే తోటి యాత్రికురాలు కూడా మాతో పాటు పైకి వచ్చింది. పైనుండి క్రిందికి దిగడము అంత కష్టము కాకపోయినా దాదాపు ౧ కిలోమీటరు క్రిందికి నిలువుగా దిగాలి. గుర్రాలను పంపించి వేసి మా షెర్పాలతో దిగడము మొదలు పెట్టాము. శిఖరమునకు దగ్గరలోనే పార్వతిదేవి జలకాలాడిన గౌరీ కుండము అనే చిన్న జలాశయము మాకు కనిపించింది. కాని ఆ పర్వత వాలులో అక్కడకు దిగి తిరిగి రావడము ప్రమాదకరమని తెలిసి ఒక షెర్పాకు మాధవి డబ్బిచ్చి పంపి పుణ్య జలాన్ని తెప్పించింది. ఆమె మాకు కూడ కొంచెము ఇచ్చింది ఇంటికి తెచ్చుకోవడానికి. ఒక రెమ్డు మూడు గంటలలో ౧౯,౦౦౦ అడుగుల నుండి ౧౭,౦౦౦ అడుగులకు వచ్చాము. అచ్చట కొంతసేపు విశ్రాంతి తీసికుని బయలుదేరుతుంటే వర్షపు జల్లులు మమ్ములను పునీతులను చేశాయి. రెయిన్ కోట్ల సహాయముతో నెమ్మదిగా దిగివచ్చి, ముందుగా వచ్చి వేంచేస్తున్న కొంతమంది యాత్రికులతో కలిసి ’లంచ్’ కొరకు తెచ్చుకొన్న ఆహారాన్ని స్వీకరించాము.

మరల అందరము కలిసి క్రిందకు దిగడము మొదలు పెట్టాము. చిన్న చిన్న సెలయేరులు గల గలా పారుతుంటే వాటిని దాటుతూ, పర్వత శ్రేణులను తిలకిస్తూ, సంతోషముతో ఆయాసము, అలసటనుకూడ మరిచిపోయాము. సాయంత్రము ౫ గంటలకు ’జుతుల్ పుక్’ అనే గ్రామములో రాత్రి బస ఏర్పాటు చేసికొన్నము.

వంటవాళ్ళు వీలైనంత త్వరలో భోజనము ఏర్పాటు చేశారు. అందరము భోజనాలు ముగించి ఆరోజు యాత్రను సమీక్షిస్తూ రాత్రి అరుగులమెద వేసిన పరుపులమీద పడుకొన్నాము. వళ్ళు నొప్పుల గురించి తలచుకొంటే బాధ ఎక్కువౌతుందని శుభ్రంగా నిద్రపోయాము. వంట వాళ్ళు, షేర్పాలు గుడారాలు వేసికొని పడుకొన్నారు. ప్రొద్దునే లేచేటప్పటికి ఆ ప్రాంతమంతా మంచుతో కప్పబడి వుంది. ౩-౪ అంగుళాల మంచు రాత్రి పడింది. చూడడానికి మంచు పర్వతాల మధ్యలో, కొండలలో, లోయలలో ఆ నివాసము ఎంతో వింతగా వుంది. మా అదృష్టము కొద్ది ఆ మంచు ఈ రోజు కురిసింది. నిన్న కురిసి వుంటే మా పర్వతారోహణ కష్టమై యుండేది. మంచులో పైకి రాళ్ళ మీద ఎక్కడము కష్టము. ఉపాహారములు మిగించి ౮ గంటలకు ముందే తిరిగి కొండ క్రిందికి చేరడానికి బయలుదేరాము. తిరిగి మా గుర్రాలు మాకు చేరాయి. కొంత దూరము పూర్తి చేశాము. చివరి మెట్టుగా ’అష్ట పది’ అనే ప్రాంతములో ఆగి కైలాస్ శిఖరాన్ని, గణేశ్, నంది, భైరవ పర్వతశ్రేణులను చూడడానికి ప్రయత్నించాము. కాని వాతవరణము మంచుతో, మంచు పొగతో కూడి వుండడం వలన అంత బాగా కన్పించలేదు. మేము దిగి వచ్చేసరికి అక్కడ వున్న యాత్రికులందరూ మేము క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషిస్తూ అందరము కలిసి మానస సరోవరమునకు దారి పట్టాము. ఆ రాత్రి మానస సరోవర ప్రాంతములో బస చేశాము. ఈ రోజు స్నానదికములు, పూజలు చేయలేదు. ఒక్క రోజైనా అనారోగ్యము పాలు కాకపోవడము మా గ్రూపు అదృష్టము. తెల్లవారగానే ’సాగా’ కు ప్రయాణము సాగిందాము. సాయంత్రము ౫ గంటలకు చీకటి పడక ముందే సాగా పట్టణము చేరాము. అదృష్టము కొద్ది హుటల్లో వేడి నీరు స్నానానికి దొరికింది. కాకపోతే ౩ గంటలు కాలము వుంటుంది. అందువలన త్వరగా స్నానాలు ముగించాము. రూముకు ఇద్దరు ముగ్గురు చొప్పున ఏర్పాటు అయిన బసలో రాత్రి విశ్రాంతి తీసికొని మరు రోజు టిబెటు దేశాం లోని న్యాలము లో ఒక రాత్రి వుండి మరు రోజు ఖాట్మండు చేరాము. కాట్మండులో మరల విశ్వనాధున్ని పార్వతీదేవిని దర్శించి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ రోజు హూటల్లో విశ్రాంతి తీసికొన్నాము. మరు రోజు వుదయము డిల్లీ కి విమానయానమునకు తయారైనాము. మిత్రులందరికి, యాత్ర పర్యవేక్షకులకు కృతజ్నతలు తెలిపి పవిత్ర మానాస సరోవర, గౌరీ కుండము నందలి పుణ్య తీర్ధాన్ని ఒకటి రెండు సీసాలలో భద్రపరచి డిల్లీ చేరాము.

ఈ రోజుతో ౧౫ రోజుల మానస సరోవరం, కైలాల పర్వత యాత్ర ముగిసినట్లే. జీవిత సాఫాల్యానికి ఒకమెట్టు. అందులో చివరి మెట్టుగా పరిగణించే కైలాస యాత్ర సుఖంగా, క్షేమంగా జరిగినందుకు, ఆ అవకాశాన్ని యిచ్చిన పరమాత్మునికి కృతజ్నతలు తెలిపికొని జన్మ ధన్యము చేసికొన్నాము.

No comments:

Post a Comment