Monday 19 May 2014

భక్తి

ప్రేమకి  పరాకాష్ట భక్తి! పరమాత్మ ఉనికిని గ్రహించి, పొంది, అనుభవించి, ఆస్వాదించే పరమోత్కృష్ట ప్రేమావేషం భక్తి. భక్తులకి భగవంతునిపై ప్రేమ ఎందుకు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. అది వారు పెనవేసున్న భక్తిపాశంపై ఆధారపడి ఉంటుంది. ప్రేమించకుండా ఉండలేక, భగవద్విరహాన్ని తాళలేక ఎన్నో రీతులుగా భక్తుడు పరమాత్మని కొలుస్తాడు. భక్తి ప్రేమలో నియమ నిబంధనలూ, అజ్ఞా పరిపాలనలూ, ముందూ వెనకలూ, పగలూ రేయిలూ అంటూ ఏవీ ఉండవు. అప్రతిహత మధుర మధు ధార లాగా నిరంతరమూ భక్తుని ప్రేమామృతం భగవంతునిపై ఒలికి స్రవిస్తూనే ఉంటుంది.
ఎన్నో రకలుగా భక్తుడు తన భక్తిని చాటుతాడు. అది బయటి ప్రపంచానికి అర్థం కానిదిగా, వింతగా, ఒక్కోసారి గర్హనీయంగా అనిపిస్తుంది కాని భక్తుని హృదయాంతరాల లోంచి చూస్తేనే అది విదితమౌతుంది. భక్తి ఒకటే కాని.. అనేక రూపాలలో ప్రత్యక్షమౌతుంది. ఉదాహరణకి శాంత, దాస్య, వాత్సల్య, మధుర, వైర, సఖ్య మొదలగు భక్తి రూపాలు.

సహజంగా నిర్మలంగా ఎట్టి భావావేశాలకి లోను కాకుండా నిరంతరం భగవంతుని అస్తిత్వాన్ని సర్వత్రా దర్శిస్తూ వాంజ్ఞ్మయ, రూప, గుణ, కర్మల కతీతంగా, జప తప యజ్ఞ యాగాది భగవత్ క్రతువుల కతీతంగా ప్రశాంత చిత్తుడై  భగవంతున్ని కొలిచేవాడు శాంతభక్తుడు, వాంజ్ఞ్మయ, విధివిధానాలలో మునిగి ఉన్నా లేకున్నా భగవంతుడి స్పృహని అనునిత్యం పొందుతూ ఆనందించే వాడు శాంతభక్తుడు. ఇతనిలో విరహోన్మాదాలు బయటకి కానరావు.ప్రసన్న ప్రశాంత చిత్తులై ఉంటారు. ఉదాహరణకి భీష్ముడు, విదురుడు, సంజయుడు, ఉద్ధవుడు మొదలగు వారు.
భగవంతుడు యజమానిగా, తనని తాను భగవంతునికి శేషిగా, దాసునిగా భావించుకుంటూ, ప్రతీ కార్యాన్ని భగవత్ప్రీతికై చేస్తూ, శాస్ర్ర సంగతులని, భగవత్భక్తుల సేవలని భగవదాజ్ఞగా భావిస్తూ, పూర్ణ శరణాగతులై  నిత్యమూ ఏదో రూపాన పరమాత్మ సేవలో తరిస్తూ ఉంటారు దాస్యభక్తులు. సాధనల కన్నా, క్రతువులకన్న, వీరికే భగవత్సేవే ముఖ్యం. సదా మెలుకువతో జాగురూపులై, వినమ్రులై  భగవత్ప్రీతే పరమావధిగా , అస్తిత్వాన్ని వదిలేసి నిరంతరమూ అహంకారాన్ని జయిస్తూ వినయులై, భగవద్విధేయులై మెలుగుతుంటారు. ఉదాహరణకి హనుమంతుడు.
తను భగవంతున్ని మిత్రునిగా, సఖ్యునిగా భావిస్తూ, తను భగవంతుని పట్ల ఎంత పారదర్శకంగా ఉన్నాడో... భగవంతుడూ తన పట్ల అలానే ఉండాలని కోరుకుంటూ, దాపరికం లేకుండా మంచీచెడుల మనసుని ఎల్లప్పుడూ భగవంతునికి తెలియబరుస్తూ ఉంటాడు సఖ్య భక్తుడు. ఆటలాడుతాడు, అలుగుతాడు, కోపగిస్తాడు, తిట్టి పొస్తాడు, బ్రతిమిలాడుతాడు  తిరిగి భగవంతున్నే చేరి మెలుగుతాడు. పరమాత్మ తోడుని ఎల్లప్పుడూ ఆశిస్తాడు. అతని పట్ల నిర్భయంతో జంకు లేకుండా ఉంటాడు. ఆపదలని కష్టాలని వేడుకగా అనుభవిస్తాడు సఖ్య భక్తుడు. భగవంతుని లీలలతో బ్రహ్మానందభరితుడౌతుంటాడు. అర్జునుడు, గోపబాలలూ, మొదలగు వారు.
పరమాత్మ నిరంతర నిరతిశయ నిరంకుశత్వానికి, నిత్యైశ్వర్యానికి, అద్వితీయ శక్తికి, అధికారానికి విరుద్ధంగా భగవంతున్ని బిడ్డగా వాత్సల్యంతో కొలుస్తారు వాత్సల్య భక్తులు. వీరు భగవంతుని పట్ల నిర్భయంతో అనాశితులై వుంటారు. భగవదనుగ్రహాన్ని కూడా వీరు ఆశించని స్థాయిలో ఉంటారు. వీరికి భగవంతుని తలవగనే మాతృభావన ఉప్పొంగుతుంది. పరమాత్మ అవతార బాల్య లీలలు వీరికి మహదానందదాయకాలు. వీరి ఆరాధన కూడా లాలనతో, జోలతో, బుజ్జగింపుతో, సేవతో, తల్లి ప్రేమతో నిబిడీకృతమై ఉంటుంది. వీరు భగవత్విరహాన్ని తాళలేరు. ఉదాహరణకి దేవకీ, యశోదా మొదలగు గోప జనులు.
సమస్త సృష్టికీ పురుషుడొక్కడే, వాడే పరమాత్మ, ఆలాంటి పురుషునికి భక్తుడు తనని తాను భగవంతుని స్త్రీ భావించుకుంటాడు, ప్రణయ ప్రేమ భావాలతో భక్తుని హృదయం నిండు పోతుంది. భగవంతుడే తన భర్త. స్త్రీపురుషుల మధ్య కలిగే మధురమైన ప్రేమభావమంతా పరమాత్మపై కురిపిస్తాడు. విరహాన్ని, కోపాన్ని, కామాన్ని, కోరికల్ని భగవంతుని పాదాల వైపు మలుస్తాడు. తన శక్తియుక్తులని ప్రేమభక్తులని అన్నీ అతనికే కేటాయిస్తాడు. ఇది భౌతిక ప్రపంచంపై భక్తునికి విరక్తిని తెస్తుంది. భవ భయ బంధాలని తృంచుకోవడంలో సహకరిస్తుంది. ఉదాహరణకి చైత్యప్రభూ, మీరా, సక్కూభాయి, గోపికలూ మొదలగువారు.
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః 
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః
ఎవ్వనివల్ల లోకమూ-లోకము వల్ల ఎవ్వడు వ్యధనొందడో, ఎవడు రాగమూ ద్వేషము భయాలనుండి ముక్తుడవునో వాడు నాకు అత్యంత ప్రీతి పాత్రుడు!
ఏది ఏమైనా పరమాత్మకి అత్యంత ప్రీతి పాత్రులు ఈ భక్తులు. పరమాత్మని  ప్రత్యక్షంగా సేవిచడం కన్నా, భక్తులని గుర్తించి సేవిస్తేనే పరమాత్మకి ప్రీతి!

అర్థివాండ్రకునీక హానిఁ జేయుటకంటెఁ దెంపుతో వసనాభిఁ దినుట మేలు
ఆఁడుబిడ్డల సొమ్ములపహరించుటకంటె బండఁ గట్టుక నూతఁ బడుట మేలు
పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె బడబాగ్ని కీలలఁ బడుట మేలు
బ్రతుకఁ జాలక దొంగపనులు చేయుటకంటెఁ గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు
జలజదళనేత్ర నీ భక్తజనులతోడి  జగడమాడెడు పనికంటెఁ జావు మేలు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!

స్వస్తి!

No comments:

Post a Comment