Monday 19 May 2014

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి

తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి దేవాలయాన్ని ప్రయివేట్ ట్రస్ట్ నుండి ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకొంటూ 2006లో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2013 జనవరి 6న కొట్టివేసింది. గత దశాబ్దకాలంగా ఈ దేవాలయాన్ని ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించిన తమిళనాడు ప్రభుత్వాన్ని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు అడ్డుకొంది.

ఈ వ్యాజ్యంలో తమిళనాడు ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది, భాజపా సభ్యుడు డా.సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ -"ఈ ఆధునిక సెక్యులర్ ప్రభుత్వాలు ఎందుకు కేవలం హిందూ దేవాలయాలను, హిందూ మత సంబంధిత సంస్థలపై మాత్రమే తమ అజమాయిషీని నడపాలని చూస్తున్నాయి? ఇతర క్రైస్తవ, మహమ్మదీయ ప్రార్థనా స్థలాలపై ప్రభుత్వం తన అజమాయిషీని చూపించడానికి ఎందుకు ఉత్సాహం చూపించడం లేదు?" అని ప్రశ్నించారు.

"పైగా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిన తరువాతనే దేవాలయాలలో అవినీతి, రాజకీయ జోక్యం అనేవి పెచ్చుమీరిపోతున్నాయి" అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా "భక్తులచే హిందూ ధర్మ ఉద్ధరణకు సమర్పించబడిన నిధులను హైందవేతర కార్యక్రమాల కోసం విచ్చలవిడిగా, విచక్షణా రహితంగా వాడేస్తున్నారు. దేవాలయాల స్థిర, చరాస్తులను రాజకీయ జోక్యంతో కొల్లగొడుతున్నారు" అని వ్యాఖ్యానించారు. 

ఇటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలు మినహాయింపు కాదు. కనుక ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మేలుకోవాలి. రాష్ట్రంలోని దేవాలయాలకు స్వయంప్రతిపత్తిని కల్పించి రాజకీయ జోక్యాన్ని నివారించాలి. తద్వారా హిందూ ధర్మ అభివృద్ధికై తోడ్పడాలి.  
 

No comments:

Post a Comment