Tuesday 17 June 2014

అశోకవన వర్ణన..

వాల్మీకి మహార్షి రామాయణం సుందరకాండలో అశోకవనాన్ని వర్ణించిన తీరు మహాదానందకరంగా కనిపిస్తుంది. ఎంతో భావుకత నిండినట్లు ఈ వర్ణనను గమనించవచ్చు. ప్రకృతి శోభకు ప్రతీకగా ఈ అశోకవనం వర్ణితమైంది. సీతాన్వేషణ చేస్తున్న హనుమంతుడు లంకానగరం అంతా అన్వేషించిన తరువాత చివరకు అశోకవనం మీదకు దృష్టి సారించాడు. రావణాసురుడి రాజభవన ప్రాకారం మీద నుంచి అశోక వన ప్రాకారం మీదకి దూకాడు. వసంతకాల సమయంలోలాగా విరగబూసిన మద్ది చెట్లను, మనోహరాలైన అశోక వృక్షాలను, చక్కగా పూసిన సంపంగి చెట్లను శింశుపా చెట్లను, పొన్న చెట్లను, మామిడి చెట్లను, తీగ కానుగు చెట్లను ఇంకా అనేక రకాల వృక్షాలను హనుమంతుడు చూశాడు. పెద్ద మామిడితోపు ఒకటి హనుమంతుడికక్కడ కనిపించింది. అక్కడికి ఒక్క గంతు పెట్టి వెళ్లాడు. ఆ అశోకవనం ఎంతో వింతగా విచిత్రంగా ఆహ్లాదంగా ఉంది. అక్కడ పక్షులు చేసే మధురగానం మైమరిపించింది. అనేక రకాల మృగాలు, పక్షులు గుంపులు, రకరకాల రంగులతో శోభాయమానంగా ఉన్నాయి. వివిధ వృక్షాలు పూలతోనూ, పండ్లతోనూ నిండుగా కనిపించాయి. కోయిల నాదాలు, తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రీంకారాలు ఆనంద జనకంగా ఉన్నాయి. వృక్షాలు, పూలు, తీగలేకాక పక్షులు, జంతువులు కూడా రుతుభేదం లేకుండా అన్ని రుతువులలోనూ ఒకేలాగా వాటి వాటి పనులను నిర్వర్తిస్తున్నాయి. ఆ వనంలో హనుమంతుడు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకు దూకుతూ వనమంతా సీతామాత కోసం కలియతిరిగాడు. హనుమంతుడి ఆ తీరుకు చెట్ల మీద ఉన్న పక్షులన్నీ భయపడి రెక్కలు అల్లాడించుకుంటూ ఆకాశానికి ఎగిరాయి. చెట్ల నుంచి రాలిన పువ్వులన్నీ హనుమంతుడిని కప్పివేశాయి. హనుమంతుడు అలా అన్ని చెట్లను శపుతూ ఉండటంతో ఆకులు, పూవులు, మొగ్గలు రాలిన ఆ చెట్లు జూదంలో ఓడిపోయి పైదుస్తులు, ఆభరణాలులాంటివి తీసి ఓటమినంగీకరించిన వారిలాగా కనిపించాయి. అలా ఆకులు, పువ్వులు, పిందేలు కాక చివరకు పక్షులు కూడా లేకపోవటంతో చెట్లు బోదెలతో మాత్రమే మిగిలాయి. అప్పుడు హనుమంతుడు ఒక్కొక్క చెట్టు బోదెను తన తోకతో చుట్టి కాళ్లతో ఆ చెట్టును తన్ని పట్టి రెండు చేతుతోనూ ఇంకా గట్టిగా శపాడు. దాంతో ఆ చెట్లన్నీ శృంగారవతి అయిన స్త్రీ ఆలింగనాల వల్ల, నలిగి రాలిన గంథపు పూతతోనూ, చుంబనాల వల్ల తెల్లబడిన పెదవులతోను, ముత్యాల్లాంటి దంతాలతోనూ, గోళ్ల నొక్కులతోనూ, పళ్లగాట్లతోనూ కనిపించే స్త్రీలాగా… మారాయి. అలా అశోకవనంలోని చెట్లను, పూల తీగల్లన్నింటినీ హనుమంతుడు చెల్లాచెదురు చేశాడు. అక్కడి నుంచి హనుమంతుడు ఒక చెట్టుపై నుంచి కిందకు దృష్టిసారించాడు. వెండి, బంగారం తాపడం చేసి మణులు పొదిగిన వేదికల్లాంటి ప్రదేశాలతో ఉన్న అశోక వనస్థలి కనిపించింది. ఆ పక్కగా దిగుడు బావులు, వాటి నిండా స్వచ్ఛమైన నీళ్లు, ఆ బావుల మెట్లకు కూడా మణులు పొదిగి ఉన్నాయి. దిగుడు బావుల పరిసరాల్లో ఇసుక ఉండాల్సిన ప్రాంతంలో ముత్యాలు, పగడాలు ఉన్నాయి. ఆ బావుల గట్ల మీద దేవకాంచన వృక్షాలు, బావి లోపల నీటిలో కలువలు, కమలాలు శోభిల్లుతూ ఉన్నాయి. చక్రవాక పక్షులు, నీటి కోళ్లు, హంసలు ఆ పరిసరాల్లో తిరుగుతూ సుస్వరాలు చేస్తున్నాయి. మరికొంత దూరంలో గలగలా సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. అక్కడికి సమీపంలోనే ఆకాశాన్నంటే శిఖరాలున్న క్రీడా పర్వతం ఉంది. చిత్ర విచిత్రాలైన ఆకారాలతో క్రీడలకు అనువుగా కొన్ని ప్రదేశాలు, రాళ్లతో కట్టిన కొన్ని ఇళ్లు, ఆ ఇళ్ల చుట్టూ మళ్లీ కొన్ని ఉద్యానవనాలు కనిపించాయి. ఆ పర్వత సమీపంలోనే విరాజిల్లుతున్న మరికొన్ని ఉద్యాన వనాలు పెద్దవిగా ఉన్న అశోకవనానికే అలంకారప్రాయాలుగా ఉన్నాయి. ఆ చెట్లన్నీ పూత, పండ్లతో నిండి వంగి కనిపిస్తున్నాయి. ఆ చెట్ల కింద ఎండా వానా తగులకుండా హాయిగా విశ్రమించటానికి అనువుగా బంగారు వెండి తాపడం చేసిన అరుగులు వాటి మీద అంతకంటే అందంగా పైకప్పులు తీర్చిదిద్ది హుందాగా కనిపించాయి. అశోకవన సమీపంలో కాంచన వృక్ష సమూహాలు శోభిల్లుతూ ఉంటే వాటికి అలంకారంగా కట్టిన చిరుగంటలు పిల్లగాలుల తాకిడికి సవ్వడి చేస్తూ వాతావరణమంతా మధుర నాదాలతో నిండినట్లుగా ఉంది. రావణాసురుడు దుర్మార్గుడే అయినా వాడి ప్రకృతి ఆరాధనాతత్వం గొప్పదన్న సత్యాన్ని ఆ ప్రాంతం రుజువు చేస్తుంది. సంపంగి, చందనం, పొగడ చెట్లు రమణీయమైన సరోవరాలు ఎలాంటి వారికైనా అలసటను పోగొట్టి హాయిని గొలిపేవిగా దర్శనమిస్తాయి. హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఆ వృక్ష సమీపంలో అందమైన ఒక చైత్య గృహం కనిపించింది. ఆ గృహంలో మధ్యభాగంలో వెయ్యి స్తంభాలున్నాయి. ఆ స్తంభాల ఆధారంగా ఆ చైత్యం పైకప్పు నిలిచి ఉంది. ఆ భవనపు మెట్లకు పగడాలు పొదిగి ఉన్నాయి. తెల్లటి రంగుతో ఆకాశాన్నంటే ఎత్తులో ఆ గృహం కనిపించింది. ఆ ప్రదేశంలోనే సీతాదేవిని హనుమంతుడు చూశాడు. వాల్మీకి మహార్షి ఇలా అశోకవన సౌందర్యాన్ని సుందరకాండలో ఎంతో చక్కగా వర్ణించాడు.

No comments:

Post a Comment