Monday 30 June 2014

'యోగ' కూడా మతమేనట...


సెక్యులరిజం ముసుగులో హిందుత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. ఏది మతం? ఏది దేశ జీవన విధానం? ఏది ఆధ్యాత్మికం? పండుగ జాతీయ పండుగ? ఏది మతపరమైన పండుగ? మన పురాణాలు చారిత్రక గ్రంథాలా లేక మతపరమైనవా? అనే పనికిరాని ప్రశ్నలు వేస్తుంటారు అతి తెలివైన మన మేధావులు.
మధ్య సుప్రీంకోర్టులో 'యోగ' అనేది మతం. దానిని అన్ని పాఠశాలలలో నేర్పించటం సెక్యులరిజానికి వ్యతిరేకమని ఒక కేసు వేయబడింది. సుప్రీంకోర్టు దీని విషయం తేల్చాలి.
పాఠశాలలలో ప్రతిరోజు ఒక కాలాంశం యోగకు కేటాయించవచ్చా? అని అక్టోబర్ 1 తేదీన సుప్రీంకోర్టు క్రైస్తవ, ఇస్లాం పాఠశాలల యాజమాన్యాలను అడిగింది. దానికి వారు అభ్యంతరం తెలిపారు.  'సూర్య నమస్కారములు, యోగ మొదలైనవి ఒక శారీరిక వ్యాయామం మాత్రమే కాదు, ఒక విశ్వాసానికి సంబంధించినవి. భగవంతునితో అనుసంధానం చేయబడినవి. కాబట్టి అవి మతానికి సంబంధించినవి' అని జాన్ దయాళ్ అనే ఒక క్రైస్తవ నాయకుడన్నాడు. ''యోగ' అనేది భారతీయ సంస్కృతికి సంబంధించినది. అది ఒక శారీరిక వ్యాయామం లాంటిది. కాబట్టి అభ్యంతరం లేదు' అని మహ్మద్ సలీం అనే ఒక ముస్లిం నాయకుడన్నాడు. ఎక్కువమంది ముస్లింలు యోగ అనేది తప్పనిసరి అంశంగా అంగీకరించారని, కొంతమంది సాంస్కృతిక జాతీయవాదం ముసుగులో హిందువులకు సంబంధించిన ప్రతిదానిని మైనార్టీలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించాడు.
యోగ అంశము అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో సమస్య చేయబడింది. సమస్య ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇది మనం సృష్టించుకున్న సెక్యులరిజం మనకు ఇస్తున్న కానుకలు.
యోగ అనేది మంచి వ్యక్తులను నిర్మాణం చేసే ప్రక్రియలో ఒక భాగం. యోగ ద్వారా శరీరాన్ని, ప్రాణాయామం ద్వారా మనస్సును, ధ్యానం ద్వారా అంతర్ముఖులం కావటం నేర్పిస్తారు. దీనిని మతపరమైనదిగా భావించి వివాదాస్పదం చేయటాన్ని మన పాలకులు, మన సెక్యులర్ మేధావులు, మన కోర్టులు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి? పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతిదానికి మనం జవాబు చెప్పుకోవలసిన అవసరం లేకుండా సుప్రీంకోర్టు సరియైన నిర్ణయం ప్రకటిస్తుందని ఆశిద్దాం.

- వాషింగ్టన్ పోస్ట్ పత్రిక, లోకహితం.. ఆధారంగా...

Sunday 29 June 2014

లోక ప్రసిద్ధం పూరి జగన్నాధుని రథయాత్ర

ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలో తీర పట్టణమైన పూరిలో ఉంది. జగన్నాథ్‌ అంటే విశ్వానికి దేవుడు అని అర్థం. శక్తి పీఠములలో ఇది 17వది. . ఇక్కడి అమ్మవారు విమలాదేవి. శ్రీ జగన్నాధాలయము హైందవులందరికి దర్శనీయం. విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వారికి ఇది అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం. హిందూ తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన ఛార్‌ థాం పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర జనం లక్షలాదిగా తరలి వస్తుంటారు. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. వైష్ణవులకు, రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైంది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్లు పూరిలోనే నివసించాడు.


శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్టించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. స్నాన యాత్రా సందర్భంగా పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటున్న భక్తులు. రోజూవారి ఆరాధన సేవలు వివరంగా ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ వేలాదిగా భక్తులు తరలివచ్చే పండుగలు అనేకం జరుగుతుంటాయి. అన్నింటికన్నా ముఖ్యమయినది జూన్‌లో జరిగే రథయాత్ర ఉత్సవం. పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాడ మాసంలో జరుగుతుంది.
ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగా పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందు పత్రిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. విచిత్రం ఏమిటంటే రథయాత్ర ప్రారంభం అయ్యే ముందు రథాన్ని, అక్కడి ప్రాంతాన్ని రాజ వంశీయులు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రాజైన స్వామి వారికి సేవకుడే అని తెలిపేందుకు అనాదిగా ఇది ఆచరిస్తున్నారు.
ఆకట్టుకునే రథాలు
రథయాతల్రో జగన్నాధుని రథాన్ని ‘నందిఘోష్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, పసుపు రంగులతో చేయబడిన దివ్య వస్త్రాలతో అలంకరించబడిన ఈ రథం 45 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీనికి అతి పెద్దవైన పదహారు చక్రాలు ఉంటాయి. బలభద్రుడి రథాన్ని ‘తాళ్‌ధ్వజ్‌’ అన్న పేరుతో వ్యవహరిస్తారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న దివ్య వస్త్రాలతో దీనిని అలంకరిస్తారు. దీని ఎత్తు 44 అడుగులు. దీనికి 14 చక్రాలు ఉంటాయి. అదేవిధంగా సుభద్రాదేవి రథాన్ని ‘దర్ప దళన’ అనే పేరుతో వ్యవహరిస్తారు.గర్భాలయంలో రత్న సింహాసనంపై కొలువై ఉన్న జగన్నాథుడు, ఆయన పెద్దసోదరుడు బల భద్రుడు, సోదరి దేవి సుభద్ర దేవతా మూర్తులను ఆలయ సింహద్వారం గుండా బయటకు తీసుకువచ్చి అలంకరించిన రథాలలో ఉంచి ఊరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయత్వంతో దేవేరుల విగ్రహాలను దర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఒక ప్రత్యేకమైన శైలిలో మూడు రథాలు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటాయి. రథం కదిలే సమయంలో శంఖాలను, గంటను మోగిస్తారు. ప్రాచీన ఐరోపా నావికులు ఈ రథచక్రాల కింద ప్రమాదవశాత్తు పడడమో, మొక్కు కోసం ఆత్మబలిదానాల ఇవ్వడమో జరిగేదని కథలుగా చెబుతారు.
ప్రతి పన్నెండు నుంచి పందొమ్మిది ఏళ్లకొకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండుసార్లు వస్తుందో అప్పుడు నబకలేవర ఉత్సవం పేరుతో చెక్క విగ్రహాలను కొత్త వాటితో మారుస్తారు. ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజున జరిగే చందన యాత్ర పండుగ రథోత్సవం కోసం రథాల నిర్మాణం ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం స్నానయాత్ర పేరుతో జ్యేష్ట మాసంలోని పౌర్ణమి రోజున అన్ని ప్రతిమలకు వేడుకగా స్నానం చేయించి అలంకరిస్తారు. అలాగే వసంతకాలంలో డోలయాత్ర, వర్షాకాలంలో ఝులన్‌ యాత్ర లాంటి పండుగలను ప్రతిఏటా నిర్వహిస్తారు. పంజిక లేదా పంచాంగం ప్రకారం పవిత్రోత్సవం, దమనక ఉత్సవాన్ని జరుపుతారు. అలాగే కార్తీక, పుష్య మాసాలలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తుంటారు.ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు...

                                                                                                                    # భరత్ కుమార్ శర్మ సంకేపల్లి.

Tuesday 17 June 2014

అశోకవన వర్ణన..

వాల్మీకి మహార్షి రామాయణం సుందరకాండలో అశోకవనాన్ని వర్ణించిన తీరు మహాదానందకరంగా కనిపిస్తుంది. ఎంతో భావుకత నిండినట్లు ఈ వర్ణనను గమనించవచ్చు. ప్రకృతి శోభకు ప్రతీకగా ఈ అశోకవనం వర్ణితమైంది. సీతాన్వేషణ చేస్తున్న హనుమంతుడు లంకానగరం అంతా అన్వేషించిన తరువాత చివరకు అశోకవనం మీదకు దృష్టి సారించాడు. రావణాసురుడి రాజభవన ప్రాకారం మీద నుంచి అశోక వన ప్రాకారం మీదకి దూకాడు. వసంతకాల సమయంలోలాగా విరగబూసిన మద్ది చెట్లను, మనోహరాలైన అశోక వృక్షాలను, చక్కగా పూసిన సంపంగి చెట్లను శింశుపా చెట్లను, పొన్న చెట్లను, మామిడి చెట్లను, తీగ కానుగు చెట్లను ఇంకా అనేక రకాల వృక్షాలను హనుమంతుడు చూశాడు. పెద్ద మామిడితోపు ఒకటి హనుమంతుడికక్కడ కనిపించింది. అక్కడికి ఒక్క గంతు పెట్టి వెళ్లాడు. ఆ అశోకవనం ఎంతో వింతగా విచిత్రంగా ఆహ్లాదంగా ఉంది. అక్కడ పక్షులు చేసే మధురగానం మైమరిపించింది. అనేక రకాల మృగాలు, పక్షులు గుంపులు, రకరకాల రంగులతో శోభాయమానంగా ఉన్నాయి. వివిధ వృక్షాలు పూలతోనూ, పండ్లతోనూ నిండుగా కనిపించాయి. కోయిల నాదాలు, తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రీంకారాలు ఆనంద జనకంగా ఉన్నాయి. వృక్షాలు, పూలు, తీగలేకాక పక్షులు, జంతువులు కూడా రుతుభేదం లేకుండా అన్ని రుతువులలోనూ ఒకేలాగా వాటి వాటి పనులను నిర్వర్తిస్తున్నాయి. ఆ వనంలో హనుమంతుడు ఒక చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకు దూకుతూ వనమంతా సీతామాత కోసం కలియతిరిగాడు. హనుమంతుడి ఆ తీరుకు చెట్ల మీద ఉన్న పక్షులన్నీ భయపడి రెక్కలు అల్లాడించుకుంటూ ఆకాశానికి ఎగిరాయి. చెట్ల నుంచి రాలిన పువ్వులన్నీ హనుమంతుడిని కప్పివేశాయి. హనుమంతుడు అలా అన్ని చెట్లను శపుతూ ఉండటంతో ఆకులు, పూవులు, మొగ్గలు రాలిన ఆ చెట్లు జూదంలో ఓడిపోయి పైదుస్తులు, ఆభరణాలులాంటివి తీసి ఓటమినంగీకరించిన వారిలాగా కనిపించాయి. అలా ఆకులు, పువ్వులు, పిందేలు కాక చివరకు పక్షులు కూడా లేకపోవటంతో చెట్లు బోదెలతో మాత్రమే మిగిలాయి. అప్పుడు హనుమంతుడు ఒక్కొక్క చెట్టు బోదెను తన తోకతో చుట్టి కాళ్లతో ఆ చెట్టును తన్ని పట్టి రెండు చేతుతోనూ ఇంకా గట్టిగా శపాడు. దాంతో ఆ చెట్లన్నీ శృంగారవతి అయిన స్త్రీ ఆలింగనాల వల్ల, నలిగి రాలిన గంథపు పూతతోనూ, చుంబనాల వల్ల తెల్లబడిన పెదవులతోను, ముత్యాల్లాంటి దంతాలతోనూ, గోళ్ల నొక్కులతోనూ, పళ్లగాట్లతోనూ కనిపించే స్త్రీలాగా… మారాయి. అలా అశోకవనంలోని చెట్లను, పూల తీగల్లన్నింటినీ హనుమంతుడు చెల్లాచెదురు చేశాడు. అక్కడి నుంచి హనుమంతుడు ఒక చెట్టుపై నుంచి కిందకు దృష్టిసారించాడు. వెండి, బంగారం తాపడం చేసి మణులు పొదిగిన వేదికల్లాంటి ప్రదేశాలతో ఉన్న అశోక వనస్థలి కనిపించింది. ఆ పక్కగా దిగుడు బావులు, వాటి నిండా స్వచ్ఛమైన నీళ్లు, ఆ బావుల మెట్లకు కూడా మణులు పొదిగి ఉన్నాయి. దిగుడు బావుల పరిసరాల్లో ఇసుక ఉండాల్సిన ప్రాంతంలో ముత్యాలు, పగడాలు ఉన్నాయి. ఆ బావుల గట్ల మీద దేవకాంచన వృక్షాలు, బావి లోపల నీటిలో కలువలు, కమలాలు శోభిల్లుతూ ఉన్నాయి. చక్రవాక పక్షులు, నీటి కోళ్లు, హంసలు ఆ పరిసరాల్లో తిరుగుతూ సుస్వరాలు చేస్తున్నాయి. మరికొంత దూరంలో గలగలా సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. అక్కడికి సమీపంలోనే ఆకాశాన్నంటే శిఖరాలున్న క్రీడా పర్వతం ఉంది. చిత్ర విచిత్రాలైన ఆకారాలతో క్రీడలకు అనువుగా కొన్ని ప్రదేశాలు, రాళ్లతో కట్టిన కొన్ని ఇళ్లు, ఆ ఇళ్ల చుట్టూ మళ్లీ కొన్ని ఉద్యానవనాలు కనిపించాయి. ఆ పర్వత సమీపంలోనే విరాజిల్లుతున్న మరికొన్ని ఉద్యాన వనాలు పెద్దవిగా ఉన్న అశోకవనానికే అలంకారప్రాయాలుగా ఉన్నాయి. ఆ చెట్లన్నీ పూత, పండ్లతో నిండి వంగి కనిపిస్తున్నాయి. ఆ చెట్ల కింద ఎండా వానా తగులకుండా హాయిగా విశ్రమించటానికి అనువుగా బంగారు వెండి తాపడం చేసిన అరుగులు వాటి మీద అంతకంటే అందంగా పైకప్పులు తీర్చిదిద్ది హుందాగా కనిపించాయి. అశోకవన సమీపంలో కాంచన వృక్ష సమూహాలు శోభిల్లుతూ ఉంటే వాటికి అలంకారంగా కట్టిన చిరుగంటలు పిల్లగాలుల తాకిడికి సవ్వడి చేస్తూ వాతావరణమంతా మధుర నాదాలతో నిండినట్లుగా ఉంది. రావణాసురుడు దుర్మార్గుడే అయినా వాడి ప్రకృతి ఆరాధనాతత్వం గొప్పదన్న సత్యాన్ని ఆ ప్రాంతం రుజువు చేస్తుంది. సంపంగి, చందనం, పొగడ చెట్లు రమణీయమైన సరోవరాలు ఎలాంటి వారికైనా అలసటను పోగొట్టి హాయిని గొలిపేవిగా దర్శనమిస్తాయి. హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ ఒక శింశుపా వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఆ వృక్ష సమీపంలో అందమైన ఒక చైత్య గృహం కనిపించింది. ఆ గృహంలో మధ్యభాగంలో వెయ్యి స్తంభాలున్నాయి. ఆ స్తంభాల ఆధారంగా ఆ చైత్యం పైకప్పు నిలిచి ఉంది. ఆ భవనపు మెట్లకు పగడాలు పొదిగి ఉన్నాయి. తెల్లటి రంగుతో ఆకాశాన్నంటే ఎత్తులో ఆ గృహం కనిపించింది. ఆ ప్రదేశంలోనే సీతాదేవిని హనుమంతుడు చూశాడు. వాల్మీకి మహార్షి ఇలా అశోకవన సౌందర్యాన్ని సుందరకాండలో ఎంతో చక్కగా వర్ణించాడు.