Saturday 9 August 2014

కష్టసుఖాల్లో తోడుగా ఉండే అన్నకు ‘రక్షాబంధన్‌’

సృష్టిలో అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ఉండే అనుబంధం వెలకట్టలేనిది.. ఎంతో అపురూపమైంది. దీనిని పది కాలాల పాటు పదిలంగా ఉంచే రక్షాబంధన్ పండుగ వచ్చేసింది. కష్టసుఖాల్లో ఎప్పుడూ రక్షగా ఉంటానంటూ… సోదరికి సోదరుడు బాస చేయడమే ఈ పండుగ ఉద్దేశం. అలాంటి అపురూప పండుగను యావద్దేశం ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటోంది.
రాఖీ.. రక్షా బంధన్.. రాఖీ పౌర్ణమి.. ఏ పేరుతో పిలిచినా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి చిరునామా రాఖీ పండుగ. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అయితే గతంలో ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో మాత్రమే ఈ పండుగను వైభవవంగా జరుపుకునేవారు. కాలం మారింది. ఇప్పుడు దేశమంతా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు.
రాఖీ అంటే రక్షాబంధన్‌. సోదరీ, సోదరుల మధ్య విడదీయలేని అనుబంధానికి రాఖీ వేడుక ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున రక్షాబంధన్‌ను ఘనంగా జరుపుకుంటారు. చెల్లెలు రాఖీ కడితే అన్నయ్యలకు విజయం తప్పక వరిస్తుందని ప్రతీ భారతీయుని నమ్మకం. అందుకే సోదరి తనకు కట్టే రాఖీ కోసం సోదరులు వేచి చూస్తారు. అలాగే సోదరునికి రాఖీ కడితే తనకు వెన్నంటే ఉండి సంరక్షించుకుంటాడని యువతుల నమ్మకం. అనుబంధానికి, అనురాగానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమి నిలుస్తుంది. ఆడ పడుచులు ఎక్కడ ఉన్నా.. ఎంత దూరంలో ఉన్నా.. రాఖీ పండగ రోజు తప్పకుండా కలుసుకుని వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో రాఖీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి చక్కని నిదర్శనంగా నిలిచే ఈ పండుగకు నేటీకి ఆదరణ మాత్రం తగ్గలేదు. మహాభారతంలో శ్రీకృష్ణుడి నుంచి అలెగ్జాండర్‌ వరకు సోదరి ప్రేమకు బానిసలుగా మారిన సంఘటనలు పురాణగాధల్లో వింటూనే ఉన్నాం. తల్లిదండ్రులు చూపే ఆత్మీయత లాగే సోదరులు, సోదరిపై చిరకాలం ప్రేమానుబంధాలను పంచడమే ఈ రక్షబంధన్‌ ప్రత్యేకత. జీవితాంతం కష్టానష్టాల్లో భర్త తర్వాత తోడుగా నిలిచే సోదరులకు ఎలాంటి కష్టాలు కలుగకుండా చూడాలంటూ సోదరీమణులు రక్షాబంధన్‌లను కడతారు. మొదట్లో రాఖీ పండుగను హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. కానీ ఇప్పుడు దేశంలో అన్ని మతాలు వారు జరుపుకుంటున్నారు.
అమ్మ పంచే ప్రేమ.. ఆప్యాయత, నాన్న చూపే అనురాగాన్ని, బాధ్యతను.. సమపాళ్ళలో అందించగల గొప్ప శక్తే అన్న.. జీవితంలో తల్లి తండ్రులు ఎంత ముఖ్య పాత్రను పోషిస్తారో అంతకన్నా గొప్ప హోదా అన్నయ్యకు ఉంటుంది. అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధానికి పునాది వేసే పండుగ.. రాఖీపౌర్ణమి.. కంటికి రెప్పలా కాపాడే అన్నయ్యను.. అనుక్షణం రక్షించుకోవడానికి చెల్లెలు కట్టే బంధనమే.. రక్షా బంధన్‌.. అన్నయ్యకు ఎలాంటి కీడు జరగకూడదనే ఉద్దేశంతో చెల్లెలు ఎంతో ప్రేమతో భక్తితో తన అన్నయ్యకు రాఖీ కడుతుంది.
సనాతన ధర్మ పరిరక్షణే ద్యేయముగా, హైందవ చైతన్య కరదీపికగా ప్రతి మాసం పాఠకుల ఇంట హైందవ ధర్మ సిద్దాంతాలను నాటుతు వెలువడుతున్న భారతీయ మానస పుత్రిక, అంతర్జాతీయ హిందూ ఆద్యాత్మీక మాస పత్రిక హైందవ సంస్కృతి ... చదవండి... చదివించండి... చందాధారులుగా చేరండి.. పూర్తి వివరాలకు 8686865615 నెంబరులో సంప్రదించండి.

No comments:

Post a Comment